హుజూర్‌నగర్‌లో వ్యవసాయ కళాశాల
రైతులకు సరైన వ్యవసాయ
సూచనలు అందే అవకాశం
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌కు వ్యవసాయ కళాశాల మంజూరైంది. ఈమేరకు రాష్ట్ర మంత్రి వర్గం గురువారం ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచే బీఎస్సీ అగ్రికల్చర్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కాలేజీ కోసం ఇప్పటికే స్థల సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలిసింది.
కోర్సులు ఇలా..
హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ కాలేజీ.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంటుంది. ఈ కాలేజీలో ముఖ్యంగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు ఉంటుంది. దీనిలో వ్యవసాయానికి సంబంధించిన కోర్సులు ఉంటాయి. అగ్రానమీ, సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పెథాలజీ, ఎంటమాలజీ, హార్టికల్చర్, న్యూట్రిషన్ తదితర వ్యవసాయ అనుబంధ కోర్సులు ఉంటాయి. నాలుగేళ్ల (బీఎస్సీ)కోర్సులో భాగంగా తొలి ఏడాదికి సంబంధించి వంద మంది వరకు విద్యార్థులకు అడ్మిషన్‌లు ఇచ్చే అవకాశం ఉంది.
పూర్తికావొచ్చిన స్థల సేకరణ ప్రక్రియ!
హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ కళాశాల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చొరవతో ఆచార్య జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు ఇటీవల నియోజకవర్గంలోని మండలాల్లో వివిధ చోట్ల అనువైన భూములను పరిశీలించారు. మొత్తం మీద హుజూర్ నగర్ శివారులోని మగ్దూం నగర్ వద్ద ఉన్న ప్రభుత్వ భూములు కళాశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు. స్థల సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చినట్లు సమాచారం. ఈనేపథ్యంలో హుజూర్‌నగర్‌లో ప్రభుత్వం వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఈ ప్రాంత ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్ భవనంలో..
ఈ విద్యా సంవత్సరం నుంచే హుజూర్‌నగర్‌లో కళాశాల తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం హుజూర్‌నగర్ పట్టణంలోని ఏదైనా ప్రైవేట్ భవనంలో కళాశాల ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ కళాశాలలో బోధించేందుకు దాదాపు 25 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రానుండగా, పాతిక మంది వరకు స్థానికులకు ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది.
వ్యవసాయ కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని రైతులకు వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సంబంధించి సరైన సూచనలు సలహాలు అందే అవకాశం ఉంది. సాంకేతిక సలహాలు లభించనున్నాయి. విత్తనాలు, పురుగు మందులు, కొత్తకొత్త వంగడాలకు సంబంధించిన సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు మరింత చేరువకానుంది. తద్వారా వారికి మరింత లబ్ధిచేకూరనుంది. ఈ కళాశాల ద్వారా నూతన వంగడాలు రైతులకు అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.
ఫ మంత్రివర్గంలో ఆమోదం
ఫ ఈ విద్యా సంవత్సరం నుంచే
ప్రారంభించేలా ప్రణాళిక
ఫ తొలుత ప్రైవేట్ భవనంలో తరగతులు
ఫ కొలిక్కివచ్చిన స్థల సేకరణ ప్రక్రియ!


