హాజరు మెరుగాయే..
విద్యార్థుల హాజరు పెంచేందుకే..
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఇంటర్మీడియట్ స్థాయిలో సర్కారు విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా స్థాయి అధికారులతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు పర్యవేక్షిస్తోంది. ఉపాధ్యాయులతో పాటు సిబ్బందికి రోజుకు రెండుసార్లు ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తోంది. విద్యార్థులకు ఒక పూట ఫేస్‌రికగ్నిషన్ హాజరునమోదు చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి నెలా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తుండటం సత్ఫలితాలిస్తోంది.
గైర్హాజర్ అయితే
తల్లిదండ్రుల సెల్ఫోన్లకు మెసేజ్
ముఖ గుర్తింపు హాజరు కోసం ఇంటర్ బోర్డు అధికారులు టీజీబీఐఆర్‌ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రస్తుతం ప్రతిరోజు విద్యార్థుల హాజరు తీసుకుంటున్నారు. ఈ విధానం వల్ల గతంలో కంటే 20 నుంచి 25 శాతం విద్యార్థుల హాజరు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఏ విద్యార్థి అయినా కళాశాలకు హాజరు కాకుంటే తల్లిదండ్రుల సెల్ఫోన్లకు మెసేజ్ వెళుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్ అందిన తరువాత తల్లిదండ్రుల నుంచి సంబంధిత కళాశాల అధ్యాపకులకు ఫోన్ రాకపోతే కళాశాల అధ్యాపకులే తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి కారణాలు తెలుసుకుంటున్నారు. ఇలా చాలా రోజులు కళాశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు అధ్యాపకులు వెళ్లి వారితో మాట్లాడి చదువు విశిష్టతను తెలిపి కాలేజీకి పంపేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం వేళ మాత్రమే విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో మధ్యాహ్నం తరువాత కూడా అమలులోకి తీసుకురానున్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు ఇంటర్ బోర్డు ముఖ గుర్తింపు హాజరును ప్రవేశ పెట్టింది. ఈ విధానం వల్ల విద్యార్థులు తప్పనిసరిగా కళాశాలకు హాజరవుతున్నారు. దీంతో పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు. తరచూ కళాశాలకు హాజరుకాని విద్యార్థులపై పర్యవేక్షణ పెరుగుతుంది.
– మృత్యుంజయ, ప్రిన్సిపాల్, తిరుమలగిరి.
ఫ జూనియర్ కాలేజీల్లో
సత్ఫలితాలిస్తున్న ఫేస్‌రికగ్నిషన్ సిస్టమ్
ఫ 20 నుంచి 25శాతం పెరిగిన
విద్యార్థుల హాజరు
ఫ డుమ్మాకొడితే తల్లిదండ్రులకు
సమాచారం
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 8
మొదటి సంవత్సరం విద్యార్థులు 1559
రెండవ సంవత్సరం విద్యార్థులు 1444


