వైద్యసాయం అందేవరకూ సీపీఆర్ చేయాలి
భానుపురి (సూర్యాపేట) : గుండె పనిచేయకుండా ఆగిపోయిన వ్యక్తులకు వైద్య సహాయం అందే వరకూ ప్రాణాలు నిలపడానికి సీపీఆర్ (కార్దియోపల్మనరీ రీససిటేషన్) అత్యవసరమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో సిబ్బందికి సీపీఆర్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుండె పనిచేయకుండా ఆగిపోయి శ్వాస తీసుకోకుండా స్పృహ కోల్పోయిన వ్యక్తులకు మాత్రమే సీపీఆర్ విధానం ఉపయోగించాలన్నారు. గుండెపోటుకు ఈ విధానం ఉపయోగించరాదని సూచించారు. ఇటీవల గుండె పనిచేయకుండా ఆగిపోవడం లాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయని, అలాంటి సమయంలో సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలని, తద్వారా ఎవరైనా ప్రమాదంలో ఉంటే వెంటనే స్పందించి సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడిన వారవుతారన్నారు. సీపీఆర్ చేసేటప్పుడు వ్యక్తులను బట్టి ఛాతీపై ఒత్తిడి చేయాలని, ఎక్కువ ఒత్తిడి చేయకూడదని సూచించారు. అనంతరం వైద్యులు సృజన, శరణ్య సీపీఆర్ ఎలా చేయాలో అందరికీ అర్థమయ్యేలా ప్రాక్టికల్‌గా చూపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్, డీసీహెచ్‌ఎస్ వెంకటేశ్వర్లు, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, వైద్య ఆరోగ్య సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


