
డీసీసీకి ఆరుగురి పేర్లు!
ఎవరికి దక్కుతుందో..?
భానుపురి (సూర్యాపేట) : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపికకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఇందుకు గానూ ఏఐసీసీ పరిశీలకుడు ఈ నెల 13 నుంచి జిల్లాలో మకాం వేశారు. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూ.. నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. పార్టీకి విధేయులుగా ఉంటూ కార్యకర్తల కోసం పనిచేస్తూ, ప్రజల్లో మంచి పేరున్న నాయకుడిని అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకొని జిల్లా నుంచి ఆరుగురి పేర్లను ఏఐసీసీకి పంపనున్నారు.
గతానికంటే భిన్నంగా
గతంలో కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితంగా, ముఖ్య నాయకులతో సఖ్యతగా ఉన్న నాయకులనే డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలకు రాహుల్‌గాంధీ పిలుపునివ్వడంతో ప్రస్తుతం క్షేత్ర స్థాయి నుంచి ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడిని ఎంపిక చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఈ విధానం సక్సెస్ కావడంతో అన్నిరాష్ట్రాల్లోనూ ఇదే విధంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. దాంతో పాటు కార్యకర్తల అభిప్రాయాలను సైతం తెలుసుకుంటోంది.
అధ్యక్ష స్థానం కోసం తీవ్ర పోటీ
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో డీసీసీ అధ్యక్ష పదవి కోసం నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. డీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో పెద్ద ఎత్తున నాయకులు దరఖాస్తు చేసుకుంటున్నారు. అధ్యక్ష పదవి తమకు ఇవ్వాలని ఏఐసీసీ పరిశీలకుడికి వినతిపత్రాలు సైతం అందించారు. తమ రాజకీయ గురువులను కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.ఈ పోటీ నడుమ డీసీసీ పదవి ఎవరిని వరిస్తుందోనని కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
వరుస సమావేశాలు
కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ నాయకులు, కార్యకర్తలతో వరస సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. బుధవారం కోదాడలో పర్యటించి కోదాడ హుజూర్‌నగర్ కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు.
అధ్యక్షుడి ఎంపికకు కాంగ్రెస్‌పార్టీ కసరత్తు
ఫ జిల్లాలో ఏఐసీసీ పరిశీలకుడి మకాం
ఫ కార్యకర్తలతో వరస మీటింగ్‌లు,
అభిప్రాయాల సేకరణ
ఫ ఆశావహుల నుంచి
దరఖాస్తుల స్వీకరణ
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 2018లో మొదటిసారిగా చెవిటి వెంకన్నయాదవ్‌ను నియమించారు. ప్రతిపక్షంలో ఉండి పార్టీపరంగా ప్రతి కార్యక్రమాన్ని ఆయన జిల్లాలో విజయవంతం చేశారు. దాంతో 2023 మేలో రెండోసారి ఆయననే డీసీసీ అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఆనాటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. జిల్లాలో బలమైన బీసీ నేత కావడం, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి కావడంతో మరోసారి అవకాశం ఉంటుందన్న చర్చ ఉంది. అయితే ప్రస్తుత డీసీసీని కొనసాగించే అవకాశం లేదని, ఎమ్మెల్యేలు, ఎంపీల బంధువులకు సైతం పదవులు ఇచ్చేది లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆదేశించినట్లు తెలుస్తోంది. దాంతో డీసీసీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనన్న చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది.