
గురుకులాల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు
నడిగూడెం : జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ సీహెచ్.పద్మ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. 5 నుంచి 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గురుకుల ఎరెన్స్‌టెస్ట్ రాసిన విద్యార్థుల్లో ఆసక్తి ఉన్న వారు ఈ నెల 16, 17 తేదీల్లో సూర్యాపేట మండలం ఇమామ్‌పేట గురుకుల పాఠశాలలో దరఖాస్తులు అందించాలని కోరారు. దరఖాస్తుతో పాటు, కుల ధృవీకరణ పత్రం, ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్ జిరాక్స్ జతపర్చాలని సూచించారు.
కలాం ఆశయ సాధనకు కృషి చేయాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) : భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశ్రాంత ఉద్యోగ సంఘం నాయకులు అన్నారు. అబ్దుల్ కలాం 94వ జయంతిని బుధవారం విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తిరుమలగిరిలోని పెన్షనర్స్ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షుడు సంకెపల్లి విఠల్‌రెడ్డి, ఎం.పద్మారెడ్డి, బన్వరి నర్సయ్య, సీహెచ్.పుల్లయ్య, మల్లయ్య, సత్తిరెడ్డి, కొమురెల్లి, రాములు, రాంరెడ్డి, కృష్ణమాచారి, విద్యాసాగర్‌రెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు.
సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలి
చిలుకూరు: ప్రభుత్వ వైద్యశాలల్లో సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్ సూచించారు. బుధవారం చిలు కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నారాయణపురం ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తలు గ్రామాణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయ మనోరి, డాక్టర్ సుభాశ్, సిబ్బంది ఉన్నారు.
బీమా యోజనను సద్వినియోగం చేసుకోవాలి
తుంగతుర్తి : కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకుల ద్వారా అమలు చేస్తున్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట నాగప్రసాద్ కోరారు. మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్‌లో పలువురు ఖాతాదారుల నామినీలకు మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కులను బుధవారం ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ బ్యాంకుల్లో ఖాతా కలిగిన వారు సంవత్సరానికి రూ.436 ప్రీమియం చెల్లిస్తే వారికి బీమా వర్తిస్తుందన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకానికి 18 నుంచి 50 సంవత్సరాలు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వారు అర్హులని తెలిపారు. బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న పేదలు ఈ బీమా యోజనను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ వెంగళరావు, సిబ్బంది పాల్గొన్నారు.

గురుకులాల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు

గురుకులాల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు