
ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉన్నాం
భానుపురి (సూర్యాపేట) : వానకాలం సీజన్ ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. ధాన్యం సేకరణపై బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టిఫెన్ రవీంద్రతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి కలెక్టరేట్‌లో కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో సూర్యాపేట జిల్లాలో 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నట్లు అంచనా వేశామన్నారు. ఈ నెల నాలుగో వారం నుంచి ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని, దానిని దృష్టిలో ఉంచుకొని ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి శిక్షణ నిర్వహించినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సామగ్రి, గన్నీ బ్యాగులు అందించినట్లు తెలిపారు. మిల్లుకు ఎంత ధాన్యం పంపించాలో ముందే ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ధాన్యం సేకరణలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌర పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, పార సరఫరాల జిల్లా మేనేజర్ రాము, డీఆర్‌డీఓ అప్పారావు, డీసీఓ పద్మ, మున్సిపల్ కమిషనర్ హనుమంత్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ శర్మ, ట్రాన్స్‌పోర్ట్ అధికారి జయప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్