
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు కనుల పండువగా నిర్వహించారు. మొదట ఆలయంలో సుప్రబాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలతో అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తంలబ్రాలతో నిత్య కల్యాణం జరిపించారు. స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు.
పశువులకు వ్యాధులపై
అప్రమత్తంగా ఉండాలి
నాగారం : పశువులకు వచ్చే సీజనల్ వ్యాధులపై పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని, గాలికుంటు వ్యాధి రాకుండా పశువులకు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ డి.శ్రీనివాసరావు సూచించారు. బుధవారం మండలంలోని ఫణిగిరిలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కలుషితమైన మేత, తాగునీరు, గాలి ద్వారా ఈ వ్యాధి ఇతర పశువులకు సంక్రమిస్తుందన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బి.వెంకన్న, డాక్టర్ బి.రవిప్రసాద్, మండల పశువైద్యాధికారి బత్తుల రవి, పశువైద్యాధికారులు పి.మౌనిక ప్రియదర్శిని, ఏ.నరేశ్, జేవీఓ వై.నాగరాజు, ఎల్‌ఎస్‌ఏలు టి.మురళి, స్వప్న, రైతులు పాల్గొన్నారు.