
5,104 కేసులు పరిష్కారం
సూర్యాపేటటౌన్ : జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో న్యాయశాఖతో సమన్వయంగా పని చేసి పోలీస్‌శాఖకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నవాటిలో 5,104 కేసులను పరిష్కరించినట్లు ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో 666 క్రిమినల్ కేసులు, 2,156 ఇ–పెట్టీ కేసులు, 2,282 యంవీ యాక్ట్, డ్రంకెన్ డ్రైవ్ కేసులు పరిష్కరించినట్లు వివరించారు. విషయంలో బాగా పనిచేసిన జిల్లా పోలీస్ శాఖ సిబ్బందిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర కన్వీనర్‌గా శ్రీధర్
నూతనకల్ : బీసీ న్యాయవాదుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌గా నూతనకల్ మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన దుగుట్ల శ్రీధర్‌ను బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నియమించారు. శ్రీధర్ శనివారం నియామకపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. బీసీ న్యాయవాదులు పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన ఆర్. కృష్ణయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
యువకులు స్పందించి..
గుంతలు పూడ్చి..
ఆత్మకూర్ (ఎస్) : రోడ్డుపై ఏర్పడిన గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాలకు గురవుతున్న విషయాన్ని గమనించిన కొందరు యువకులు స్పందించి శనివారం శ్రమదానం చేసి ఆ గుంతలను పూడ్చారు. ఆత్మకూర్(ఎస్) మండలం బోరింగ్ తండా సమీపంలో ఉన్న సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల వల్ల ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన బోరింగ్ తండా కొందరు యువకులు శ్రమదానం చేసి గుంతలను పూడ్చివేశారు. ఈ సందర్భంగా శ్యామ్ అనే యువకుడు మాట్లాడుతూ.. ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు తమ వంతుగా మిత్రులతో కలిసి గుంతలు పూడ్చి వేశామని తెలిపారు.

5,104 కేసులు పరిష్కారం