
కేసు నమోదు
మోతె : వినాయక నిమజ్జన వేడుకల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా, పోలీసుల అనుమతి లేకుండా డీజే వినియోగించిన నిర్వాహకులపై కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండల పరిధిలోని రావిపహాడ్ గ్రామంలో పోలీసుల అనుమతి లేకుండా సోమవారం రాత్రి వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే వినియోగించారు. దీంతో వేడుకల నిర్వాహకుడు పులగుజ్జు కార్తీక్, ఆర్గనైజర్ కోడి మహేష్‌పై కేసు నమోదు చేసి డీజే, వాహ నం సీజ్ చేసినట్లు మోతె ఎస్‌ఐ టి.అజయ్‌కుమార్ గురువారం తెలిపారు.
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
చిలుకూరు : చిలుకూరు మండలం రామచంద్రానగర్ వద్ద ఉన్న ఆర్‌కె మేజర్ కాల్వలో గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ సురేష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలికి 50 నుంచి 55 సంవత్సరాలు ఉండవచ్చని, రెండు చేతులకు పచ్చబొట్లు, ముక్కుకు రెండు పుడకలు, రెండు చెవులకు మాటీలు ఉన్నట్లు తెలిపారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ద్విచక్ర వాహనం చోరీ
మునగాల: మునగాల మండలంలోని కృష్ణానగర్‌లో బుధవారం అర్ధరాత్రి ఓ ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. వివరాలు.. గ్రామానికి చెందిన గుండ్లపల్లి నర్సిరెడ్డి తన బైక్‌కు తాళం వేసి ఇంటి ఆవరణలో ఉంచి నిద్రకు ఉపక్రమించాడు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి గోడ దూకి లోపలికి వచ్చి ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసినట్లు బాధితుడు నర్సిరెడ్డి తెలిపారు. ఈ మేరకు తాను గురువారం మునగాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు నర్సిరెడ్డి పేర్కొన్నారు.