
యూరియా పాట్లు
ఫ వేకువజాము నుంచే పీఏసీఎస్‌లు, మనగ్రోమోర్ సెంటర్ల బాట
ఫ క్యూకట్టి రోజంతా రైతుల నిరీక్షణ
ఫ అయినా అందరికీ అందని యూరియా
ఫ అర్వపల్లిలో రాస్తారోకో
తిరుమలగిరి (తుంగతుర్తి) : యూరియా కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. తెల్లవారిందంటే చాలు పీఏసీఎస్‌లు, మనగ్రోమోర్ కేంద్రాల వద్దకు పరుగెపెడుతున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్‌కార్డులు క్యూలైన్లలో పెట్టి పొద్దస్తమానం నిరీక్షిస్తున్నారు. కొన్నిచోట్ల చెప్పులు పెట్టి ఎదురుచూస్తున్నారు. తిరుమలగిరి పీఏసీఎస్ కార్యాలయానికి గురువారం 440 బస్తాల యూరియా రావడంతో ఉదయం 6 గంటల నుంచే రైతులు కార్యాలయం ఎదుట బారులుదీరారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఒక్కొక్కరిని లోనికి అనుమతించారు. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో రైతులు కార్యాలయానికి వచ్చారు. ఒక్కొక్కరికి రెండు బస్తాల యూరియాను ఇచ్చారు. వచ్చిన రైతులకు యూరియా దొరకక పోవడంతో సాయంత్రం వరకు కార్యాలయం ఎదుట నిరీక్షించారు. లైన్‌లో ఉన్న రైతులను కూర్చోబెట్టి వ్యవసాయ అధికారులు, పీఏసీఎస్ కార్యాలయ సిబ్బంది పోలీస్‌పహారా టోకెన్లను అందజేశారు. చాలా మంది రైతులకు యూరియా దొరకక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, చైర్మన్ పాలెపు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పెన్‌పహాడ్: పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామంలోని నారాయణగూడెం పీఏసీఎస్ కార్యాలయం వద్దకు రైతులు పెద్దసంఖ్యలో వచ్చారు. పట్టాదారుపాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు జిరాక్స్‌లు క్యూలెన్లలో పెట్టి ఎదురుచూస్తున్నారు. అనంతారంలో 277 బస్తాలను రైతులకు అందించగా, నారాయణగూడెం పీఏసీఎస్ కార్యాలయానికి 277 బస్తాలను తరలించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వేచి ఉన్నా కొందరికే దొరకడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలైన్‌లో ముందు వరుసలో ఉన్నవారికి ఒకరికి ఒక బస్తా చొప్పున మాత్రమే ఇచ్చారు. ఎస్‌ఐ గోపికృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.
అర్వపల్లి: యూరియా కోసం జాజిరెడ్డిగూడెం మండల రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. అర్వపల్లి, తిమ్మాపురం పీఏసీఎస్‌ల వద్ద గురువారం తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా కొరతను వెంటనే తీర్చాలని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్వపల్లి పీఏసీఎస్ వద్ద కార్యాలయ షట్టర్లను కొద్దిసేపు కొట్టారు. యూరియా కోసం చెప్పులను క్యూలైన్‌లో పెట్టి రోజంతా నిరీక్షించారు. యూరియా రాకపోవడంతో రాస్తారోకో చేశారు. దీంతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. నాగారం సీఐ నాగేశ్వరరావు తన సిబ్బందితో రెండు కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

యూరియా పాట్లు