
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
అనంతగిరి: తాళం వేసి ఉన్న ఇంట్లో బంగారం చోరీ జరిగిన సంఘటన అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం అమీనాబాద్ గ్రామానికి చెందిన గరిడేపల్లి రాధయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గోడకు తగిలించి ఉన్న తాళం చెవి తీసుకుని ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. బాధితుడు రాధయ్య కూతురు సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
తండ్రిపై మమకారం..
వ్యవసాయ క్షేత్రంలో ప్రతిరూపం
ఆత్మకూర్ (ఎస్) : కనిపెంచిన తండ్రి విలువను వారు వదులుకోలేదు. తమ నుంచి తండ్రి దూరమై ఏడాదైనా ఆ జ్ఞాపకాలను అలాగే నెమరవేసుకున్నారు. తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని తమ వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించుకుని ప్రేమను చాటుకున్నారు ఆ కుమారులు. ఆత్మకూర్ (ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు గుండు అబ్బయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా తమ తండ్రి జ్ఞాపకార్థం ఆయన కుమారులు గుండు లింగయ్య, గుండు రమేష్.. అబ్బయ్య విగ్రహాన్ని తయారు చేయించారు. గురువారం అబ్బయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో స్థానిక సీపీఎం నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుండు చిన్న లింగయ్య, రాచకొండ రమేష్, మడ్డి రమేష్, బుర్ర సోమయ్య పాల్గొన్నారు.
ఎరువుల డీలర్లపై కేసు
గుర్రంపోడు : గుర్రంపోడు మండల కేంద్రంలో గురువారం మండల వ్యవసాయ అధికారి కంచర్ల మాధవరెడ్డి తన సిబ్బందితో కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో అధిక ధరలకు యూరియా విక్రయించిన ముగ్గురు డీలర్లపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పసుపులేటి మధు తెలిపారు. యూరియా బస్తా ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా రూ.266 లకు విక్రయించాల్సి ఉండగా కొంతమంది రైతుల వద్ద రూ.300 తీసుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో శరవణ ఫర్టిలైజర్ యజమాని ఎర్ర శ్రీనివాసరావు, శ్రీలక్ష్మీ ఫర్టిలైజర్ యజమాని బొమ్ము ఆనంద్, సాయిరాం ఏజెన్సీ యజమాని చందా గోవింద్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.