
సారూ.. ఒక్క బస్తా ఇవ్వండి
మన గ్రోమోర్ కేంద్రం వద్ద క్యూ
ఫ పీఏసీఎస్‌లు, మనగ్రోమోర్ సెంటర్ల వద్ద
రోజంతా నిరీక్షించినా చాలామందికి నిరాశే
అర్వపల్లి: యూరియా కోసం రైతులు నానాపాట్లు పడుతున్నారు. తెల్లవారిందంటే చాలు పీఏసీఎస్‌లు, మన గ్రోమోర్ సెంటర్ల వద్ద క్యూకడుతున్నారు. ఒక్క బస్తా అయినా దొరుకకపోతదా అంటూ చాంతాడంత లైన్‌లో ఎంతో ఆశతో నిరీక్షిస్తున్నారు. చివరికి యూరియా దొరకక నిరాశతో వెనుదిరుగుతున్నారు. అర్వపల్లిలోని పీఏసీఎస్‌కు బుధవారం 450 బస్తాల యూరియా రాగా రైతులు 365బీ హైవేపై క్యూలైన్‌లో ఉన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మండే ఎండలో రోడ్డుపై నిల్చొని యూరియా తీసుకున్నారు. క్యూలైన్లలో ముందు వరుసలో ఉన్న రైతులకు మాత్రమే ఒక్కో బస్తా చొప్పున దొరికింది. స్థానిక ఏఎస్‌ఐ రామకోటి పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేయించారు.
టోకెన్ల కోసం ఎగబడిన రైతులు
మునగాల: మునగాలలోని మన గ్రోమోర్ కేంద్రానికి 1,100బస్తాల యూరియా వచ్చింది. దీంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఉదయం నుంచే కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో జాతీయరహదారి పక్కన మన గ్రోమోర్ కేంద్రం ఉండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే ప్రమాదముందని మునగాల సీఐ డి.రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ బి.ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు రైతాంగానికి ఒక్కొక్కరికి రెండు బస్తాల యూరియా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో గణపవరం రోడ్డులో గల రైతువేదిక కార్యాలయంలో టోకెన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మండల వ్యవసాయాధికారి బి.రాజు, ఏఈఓ రమ్యతేజ చేపట్టారు. దీంతో రైతులు రైతువేదిక కార్యాలయం వద్ద టోకెన్ల కోసం ఎగబడ్డారు. మన గ్రోమోరు సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పోలీసుల సహకారంతో 550టోకెన్లను రైతులకు అందజేశారు. టోకెన్లు అందుకున్న రైతులు తిరిగి మన గ్రోమోరు కేంద్రం వద్ద యూరియా కోసం అర కి.మీ మేర క్యూ కట్టారు. వీరికి పంపిణీ చేయగా 100 మంది వరకు యూరియా అందక వెనుదిరిగారు.
మఠంపల్లి: మఠంపల్లి లోని మన గ్రోమోర్ కార్యాలయం వద్ద బుధవారం వివిధ గ్రామాల రైతులు యూరియా కోసం బారులుదీరారు. 700 మంది రైతులు రాగా 500 మందికి పంపిణీ చేశారు. ఎకరం ఉన్న రైతులకు ఒకబస్తా, రెండు ఎకరాలుఆపైన ఉన్నవారికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. మిగతా 200 మంది రైతులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

సారూ.. ఒక్క బస్తా ఇవ్వండి

సారూ.. ఒక్క బస్తా ఇవ్వండి