
మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో టీచర్లు కీలకం
సూర్యాపేటటౌన్ : సమాజంలో గురు – శిష్యుల బంధం ఎంతో పవిత్రమైనదని, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన గురుపూజోత్సవంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 40 మందికి అవార్డులు అందజేశారు. అంతకు ముందు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా ప్రయాణం మొదలుపెట్టి రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఎన్నో గొప్ప పదవులు పొందారన్నారు. సర్వేపల్లిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. జిల్లాలో ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లను ఎంతగానో పెంచారని, అలాగే నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. ఫలితాల్లో కూడా ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు వారి సామర్థ్యాలను పెంచుకోవాలన్నారు. నూతన బోధన పద్ధతులు నేర్చుకొని విద్యార్థులను నవీన సాంకేతిక వైపు ఆలోచించేలా తయారు చేయాలన్నారు. విద్యార్థులు నిజజీవితంలో సైన్‌న్స్ ఉపయోగాలు తెలుసుకొని ఆవిష్కరణాత్మక ఆలోచనల వైపు ముందడుగు వేసేలా చూడాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారిని ముందంజలోకి తీసుకొని రావాలన్నారు. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో చాలా గొప్పదని జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు టీచర్లు అహర్నిశలు కష్టపడుతున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ అశోక్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు శ్రవణ్‌కుమార్, వై.రాంబాబు, పూలమ్మ, జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారం పవిత్ర, రాష్ట్ర అవార్డు గ్రహీతలు చత్రు నాయక్, యల్లయ్య, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, టీచర్లు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
ఫ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం