భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో మార్పు తెచ్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతాంగ పోరాటంలో భాగంగా అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆమె త్యాగాలు, పోరాట స్ఫూర్తి భావితరానికి దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీబీసీడీఓ నరసింహారావు, డీపీఓ యాదగిరి, డీఎస్‌డీడబ్ల్యూఓ దయానందరాణి, బీసీ సంఘం నాయకులు నాయకులు చల్లమల్ల నరసింహ, బంటు కృష్ణ, మల్లికార్జున్, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, పద్మ, శ్రీదేవి పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్‌గా సీతారామారావు
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా కొలనుపాక సీతారామారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా పనిచేసిన రాంబాబు ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. సీతారామారావు ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో స్పెషల్ కలెక్టర్(ఐ– క్యాడ్)గా విధులు నిర్వహిస్తున్నారు.
మట్టపల్లి క్షేత్రంలో
విశేష పూజలు
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిత్యపూజలు, ఆర్జితసేవలు చేపట్టారు. ఈసందర్భంగా శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణలతో వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో అర్చకులు, భక్తులు ఊరేగించారు. అనంతరం నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.