వాస్తవాలు తేల్చేందుకు సిద్ధమైన యంత్రాంగం
ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు
ఉమ్మడి జిల్లాలోని మిల్లుల పరిశీలనకు ప్రణాళిక
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి బృందాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ఇచ్చిన ధాన్యం ఏయే మిల్లుల్లో ఎంత మేరకు ఉంది? సీఎంఆర్ కింద ఆయా మిల్లులు ఎంత బియ్యం ఇచ్చాయి? ఇంకా ఎంత బియ్యం ఇవ్వాల్సి ఉంది? అన్న లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ), పౌరసరఫరాల శాఖ అధికారులతో కూడిన బృందాలతో జాయింట్ ఫిజికల్ వెరిఫికేషన్ (జేపీవీ) నిర్వహించాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో మిల్లుల్లో ఈ తనిఖీలు చేపట్టేందుకు ఎఫ్‌సీఐ ఆదేశాలు జారీ చేసింది. 2024–25 వానాకాలం, యాసంగి సీజన్లలో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం, ఎఫ్‌సీఐకి వచ్చిన సీఎంఆర్, ఇంకా రావాల్సి ఉన్న సీఎంఆర్‌కు సంబంధించిన ధాన్యం ఆయా మిల్లుల్లో ఉందా? లేదా? అన్న లెక్కలు తేల్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఈ తనిఖీలు ప్రారంభం కానున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే రంగంలోకి..
గత ఆర్థిక సంవత్సరంలోని సీజన్లకు సంబంధించిన ధాన్యం, సీఎంఆర్ లెక్కలు పక్కాగా తేల్చాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రా సింది. ఎఫ్‌సీఐ నేతృత్వంలోనే ఈ తనిఖీలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎఫ్‌సీఐ త నిఖీ బృందాలను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
30 రోజుల్లో సీఎంఆర్ ఇవ్వాలని నిబంధన
సాధారణంగా మిల్లులకు సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని మరాడించి నెల రోజుల్లోగా ఎఫ్‌సీఐకి బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. అయితే మిల్లుల వద్దే ధాన్యం నెలల తరబడి ఉంటోంది. సకాలంలో ఎఫ్‌సీఐకి సీఎంఆర్ ఇవ్వడం లేదు. ఒక సీజన్‌లో ఇచ్చిన ధాన్యం మరో సీజన్ ధాన్యం వచ్చే నాటికి కూడా మిల్లర్లు బియ్యాన్ని ఇవ్వడం లేదు. కొందరు మిల్లర్లు సంవత్సరాలు అవుతున్నా సీఎంఆర్ ఇవ్వడం లేదు. ఇలా జిల్లాలో పలువురు మిల్లర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.
మామూళ్ల మత్తులో కొందరు అధికారులు
సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు మరాడించి బియ్యం అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయట పడింది. సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యం ఆయా మిల్లుల్లో లేదని తేలింది. ఒక సీజన్ ధాన్యాన్ని అమ్ముకుంట్నున మిల్లర్లు మరో సీజన్‌లో ధాన్యం వచ్చే వరకు ఆగి, అప్పుడు సీఎంఆర్ ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడమే కాకుండా తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి సీఎంఆర్‌కు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పౌరసరఫరాల సంస్థ, పౌర సరఫరాల శాఖ అధికారులు కొందరు మిల్లర్లతో కుమ్మకై ్క మామూళ్లు తీసుకుని కఠినంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి ధాన్యం తీసుకొని సీఎంఆర్ బియ్యం ఇవ్వకున్నా నామమాత్రపు కేసులతో మమ అనిపిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిల్లుల్లో ధాన్యం నిల్వలు, సీఎంఆర్‌కు సంబంధించిన లెక్కలను తేల్చేందుకు ఎఫ్‌సీఐ చర్యలు చేపట్టింది.
● సూర్యాపేట జిల్లాలో వానాకాలం సీజన్ మిల్లులకు 1,65,353 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా, ఇప్పటివరకు 64,062 మెట్రిక్ టన్నుల బియ్యమే ఇచ్చారు. ఇంకా 48,197 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. యాసంగి సీజన్‌లో 2,89,690 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా, 31,686 మెట్రిక్ టన్నుల బియ్యమే సీఎంఆర్ కింద మిల్లర్లు ఇచ్చారు. ఇంఆక 1,62,373 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది.
● యాదాద్రి భువనగిరి జిల్లాలో వానాకాలం సీజన్‌కు 1,50,600 మెట్రిక్ బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,16,000 మెట్రిక్ టన్నుల బియ్యమే వచ్చింది. ఇంకా 34,600 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. యాసంగి సీజన్‌లో 2.54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఇప్పటివరకు 90 వేల మెట్రిక్ టన్నుల బియ్యమే వచ్చింది. ఇంకా 1,64,000 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది.
● నల్లగొండ జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2,75,840 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు కేటాయించగా, 1,86,218 మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చారు. ఇంకా 6,143 మెట్రిక్ టన్నులు ఇవ్వలేదు. యాసంగి సీజన్‌లో 6,03,305 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు ఇవ్వగా, అందులో 4,07,671 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ కింద ఇవ్వాల్సి ఉండగా, 2,02,277 మెట్రిక్ టన్నులే ఇచ్చాయి. ఇంకా 2,05,394 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది.
రావాల్సి ఉన్న సీఎంఆర్ (మెట్రిక్ టన్నుల్లో)
జిల్లా వానాకాలం యాసంగి మొత్తం
నల్లగొండ 6,143 2,05,394 2,11,537
సూర్యాపేట 48,197 1,62,373 2,10,570
యాదాద్రి 34,600 1,65,000 1,99,600

మిల్లుల్లో ధాన్యం ఉందా?