
10న ఓటరు తుది జాబితా
భానుపురి (సూర్యాపేట ): వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా ఈనెల 10వ తేదీన ఓటరు తుది జాబితా ప్రకటించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వెల్లడించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 23 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, 235 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలలో మొత్తం 6,94,815 మంది ఓటర్లు ఉన్నారని,1272 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. చనిపోయిన ఓటర్ల వివరాలను మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు, కుటుంబ సభ్యుల ఆమోదం తీసుకొని ఫారం–7 ద్వారా తొలగిస్తామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీసీఈఓ వి.వి అప్పారావు, డీపీఓ యాదగిరి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, డీఎల్పీఓ నారాయణరెడ్డి, నాయకులు రాజేశ్వరరావు, నర్సింహ, ఆబిద్, గోపి, భిక్షం, వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు, రమేష్, డేవిడ్ కుమార్, సైదులు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు
జిల్లాలో సరిపోను యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులెవరూ అధైర్య పడవద్దని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో సోమవారం 640 మెట్రిక్ టన్నులకు గాను 520 మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయని, ఇంకా 120 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మంగళవారం అదనంగా 420 మెట్రిక్ టన్నుల యూరియా అన్ని పీఏసీఎస్, డీలర్ కేంద్రాల్లో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. దీంతో కలుపుకొని మొత్తం 540 మెట్రిక్ టన్నుల యూరియా నిలువలు జిల్లాలో ఉంటాయని స్పష్టం చేశారు. రానున్న రెండు రోజుల్లో జిల్లాకు మరో 860 మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా అవుతున్నదని తెలిపారు.
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్