
జీపీఓలు విధులు సక్రమంగా నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామ పాలన అధికారులు (జీపీఓలు) విధులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో గ్రామ పాలన అధికారులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో కలెక్టర్ మాట్లాడారు. అభ్యర్థి సొంత నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గంలో పోస్టింగ్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, పరిపాలన అధికారి సుదర్శన్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
యూరియా కొరత తీర్చాలి
హుజూర్‌నగర్ : రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చేసి రైతుల ఇబ్బందులు తీర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హుజూర్‌నగర్ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ సీజన్‌కంటే ముందే రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వాలు ప్రకటనలు చేసి ఆచరణలో విఫలమైందన్నారు. యూరియా కోసం రైతుల కుటుంబ సభ్యులంతా సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పెండింగ్‌లో ఉన్న సన్నధాన్యం అమ్మిన బోనస్ డబ్బులను అందించాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టేపు సైదులు, నాయకులు మురళి, యోన, వెంకన్న, మల్లయ్య, వెంకటి, శంభయ్య పాల్గొన్నారు.
గోండ్రియాల పీఏసీఎస్ చైర్‌పర్సన్‌పై అనర్హత వేటు
అనంతగిరి: మండల కేంద్రంలోని గోండ్రియాల సహకార సంఘ చైర్‌పర్సన్ నెలకూర్తి ఉషారాణిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు డీసీఓ పద్మ శనివారం అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సహకార సంఘ నూతన చైర్మన్‌గా బుర్ర నర్సింహారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం సంఘంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో చైర్‌పర్సన్ నెలకూర్తి ఉషారాణి అవకతవకలకు పాల్పడినట్లు డీసీఓకు ఫిర్యాదు అందడంతో విచారణకు ఆదేశించారు. విచారణ జరుగుతున్న క్రమంలో సంఘంలో సదరు చైర్‌పర్సన్, సొసైటీ కార్యవర్గ, బైలా నిబంధనలకు విరుద్ధంగా 85శాతానికి మించి గోల్డ్ లోన్ తీసుకున్నట్లు గుర్తించారు. ఈ మేరకు 21ఏఏ చట్టం ప్రకారం సొసైటీ చైర్‌పర్సన్‌పై అనర్హత వేటు వేసినట్లు డీసీఓ తెలిపారు.
మట్టపల్లిలో విశేష పూజలు
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి విశేష పూజలు కొనసాగాయి. శుక్రవారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆలయంలో బసచేసి తెల్లవారుజాముననే కృష్ణానదిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు పాల్గొన్నారు.

జీపీఓలు విధులు సక్రమంగా నిర్వహించాలి