
సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి
సూర్యాపేట అర్బన్ : జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పంటల విస్తీర్ణం పై అంచనా వేసి సరిపడా యూరియా అందుబాటులో ఉంచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. అధికారులు యూరియా నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్షించి సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత, సంఘం జిల్లా నాయకులు షేక్ సైదా, మందాడి రామ్ రెడ్డి, నారాయణ, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.