
మరమ్మతులు సగమే!
శాశ్వత మరమ్మతులు చేపట్టాలి
అంచనాలు సిద్ధం చేస్తున్నాం
నడిగూడెం : నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం గ్రామ పరిధిలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కట్టకు 132.500 కిలోమీటర్ వద్ద గతేడాది సెప్టెంబర్ 1న గండిపడిసోమవారంతో ఏడాది పూర్తి అవుతున్నా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టలేదు. కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో కాల్వకట్టకు మళ్లీ ఎక్కడ గండ్లు పడతాయోనని మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేవలం మట్టిపోశారు..
ఇసుక బస్తాలు పేర్చారు..
గతేడాది ఇదేనెలలో ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. అదే సమయంలో భారీ వర్షాలకు పాలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ కాల్వలోకి వెదురెక్కి వచ్చింది. ఈ క్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు ఖమ్మం జిల్లా పరిధిలో రంగుల వంతన వద్ద ఉన్న ఎస్కేప్ గేట్లు ఎత్తక పోవడంతో కాగితరామచంద్రాపురం గ్రామ సమీపంలో కాల్వ కట్టకు భారీగా గండి పడింది. దీంతో రామచంద్రాపురం రైతుల పొలాలు నీటమునిగి, వరద ప్రవాహంలో విద్యుత్ మోటార్లు కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో కాల్వకట్ట అత్యవసర మరమ్మతలకు నీటి పారుదల శాఖ నుంచి నుంచి రూ.2.10 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో గండి పడిన ప్రాంతంలో 5.2 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల పొడవునా కేవలం మట్టిపోసి ఇసుక బస్తాల వేసి కట్టకు అత్యవసర మరమ్మతులు చేయించారు. అయినప్పటికీ నేటికీ కాల్వకట్ట పూర్తి స్థాయి మరమ్మతులకు నోచుకోలేదు. గత వేసవిలోనూ లైనింగ్, సిమెంట్ కాంక్రీటు, ఫ్లోరింగ్ పనులు చేపట్టలేదు. ఇంకా ఆ ప్రాంతంతో పాటు, రామాపురం, చాకిరాల, సిరిపురం వద్ద ప్రధాన కాల్వ కట్ట అక్కడక్కడా బలహీనంగా ఉన్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడంలేదు. ఫలితంగా మళ్లీ పలుచోట్ల గండ్లు పడే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొనసాగుతున్న ఆధునీకరణ పనులు
నీటి పారుదల శాఖ పున:వ్యవస్థీకరణలో భాగంగా సాగర్ ఎడమ కాల్వ 74వ కిలోమీటర్ నుంచి 132.500 కిలోమీటర్ వరకు సూర్యాపేట జిల్లా పరిధిలోకి వచ్చింది. పైభాగంలో ఇప్పటికే 74 కిలోమీటర్ నుంచి 115 కిలోమీటర్ మునగాల వరకు రూ.29 కోట్లతో మేఘా సంస్థ ఆధ్వర్యంలో కాల్వ కట్ట ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి.
కాగితరామచంద్రాపురం వద్ద ఎడమ కాల్వ కట్టకు గండిపడి నేటికి ఏడాది
ఫ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో
చేపట్టని మరమ్మతులు
ఫ మట్టిపోసి మమ అనిపించిన
అధికారులు
ఫ అక్కడక్కడా అధ్వానంగా కాల్వకట్ట
ఫ మళ్లీ గండ్లు పడే ప్రమాదం ఉందని రైతుల ఆందోళన
గతేడాది మా గ్రామ సమీపాన సాగర్ ఎడమ కాల్వ కట్టకు గండి పడి వందల ఎకరాల్లో వరిపంట నష్టపోయాం. నేటికీ మరమ్మతులు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. కాల్వ కట్టకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలి.
– చక్రాల వెంకన్న, రైతు,
కాగితరామచంద్రాపురం
మునగాలలోని 115 కిలోమీటర్ నుంచి నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం రంగుల వంతెన 132.500 కిలోమీటర్ వరకు పూర్తి స్థాయిలో శాశ్వత మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే మరోసారి సాగర్ ఎడమ కాల్వ కట్టకు గండ్లు పడకుండా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడతాం.
– రఘు, డీఈ, సాగర్ ఎడమ కాల్వ

మరమ్మతులు సగమే!

మరమ్మతులు సగమే!