
సీపీఎస్ రద్దు ధర్నాకు సంపూర్ణ మద్దతు
సూర్యాపేటటౌన్ : సీపీఎస్ రద్దు కోసం సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నాకు మోడల్ స్కూల్ పీఎంటీఏ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండగాని రాజయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ జిలాని, రాష్ట్ర బాధ్యుడు గుర్రాల సోమయ్యగౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం పునరాలోచించి సీపీఎస్‌కు బదులు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.
రాహుల్‌గాంధీ
వ్యాఖ్యలు సరికావు
నేరేడుచర్ల : దేశ ప్రధాని నరేంద్రమోదీ మాతృమూర్తిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం నేరేడుచర్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టిడించేందుకు వెళ్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన తల్లిని అవమానించే విధంగా రాహుల్‌గాంధీ వాఖ్యాలు చేయడం భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. అరెస్ట్ అయిన వారిలో నేరేడుచర్ల, పాలకవీడు మండలాల అధ్యక్షుడు నాగిరెడ్డి, నర్రినాయక్, నాయకులు సత్యనారాయణ, రమేష్, నరేందర్‌రెడ్డి, ఏమి రెడ్డి శంకర్‌రెడ్డి, కాలం నాగయ్య ఉన్నారు.
పాలన వైఫల్యంతోనే మార్వాడీ గో బ్యాక్ నినాదం
సూర్యాపేట అర్బన్ : పాలన వైఫల్యంతోనే మార్వాడీ గో బ్యాక్ నినాదం వచ్చిందని సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మార్జున్, సీపీఐ సీనియర్ నాయకుడు దంతాల రాంబాబు ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి ఎస్‌కే.నజీర్ ఆరోపించారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో జరిగిన ఘటనను పోలీసులు సకాలంలో పట్టించుకుంటే మార్వాడీ గోబ్యాక్ నినాదం వచ్చేంది కాదన్నారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు గంట నాగయ్య, అనంతల మధు, కునుకుంట్ల సైదులు, జనార్దన్ యాదవ్, కరీం, వెంకట్ యాదవ్, చామకూర నరసయ్య, నాగయ్య, నారబోయిన కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

సీపీఎస్ రద్దు ధర్నాకు సంపూర్ణ మద్దతు