
ఇంటర్‌లోనూ ముఖగుర్తింపు హాజరు
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా స్థాయి అధికారులతో పర్యవేక్షిస్తోంది. కాలేజీలకు ఉదయం వచ్చిన విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లి తిరిగి రావడం లేదు. మరికొందరు ఇంటి వద్ద కళాశాలకు వెళుతున్నామని చెప్పి సరిగా హాజరు కావడం లేదు. దీనిని అరికట్టి హాజరు శాతం పెంచి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ముఖ గుర్తింపు హాజరు కోసం ప్రభుత్వం యాప్‌ను సిద్ధం చేసింది. ఈ హాజరు విధానం జిల్లాలో గతనెల 23నుంచి అమలు చేస్తున్నారు.
రోజుకు రెండు సార్లు
జిల్లాలోని ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. విద్యార్థుల హాజరును ముఖ గుర్తింపు ద్వారా తీసుకుంటున్నారు. యాప్ ద్వారా రోజూ ఉదయం, మధ్యాహ్నం హాజరు తీసుకుంటారు. ఒక వేళ విద్యార్థి హాజరు కాకుంటే వారి తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌లకు మెసేజ్ వెళుతుంది. ఈ హాజరును కళాశాల ప్రిన్సిపాల్, డీఐఈఓ, రాష్ట్ర అధికారులు పర్యవేక్షించనున్నారు.
3,003 మంది ఇంటర్ విద్యార్థులు
జిల్లాలో ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 3,003 విద్యార్థులు విద్యభ్యసిస్తున్నారు. వీరిలో ఫస్టియర్ 1,559 మంది, సెకండియర్ 1,444 మంది విద్యార్థులు ఉన్నారు. హాజరు నమోదు విధానంపై ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. అధ్యాపకులు ప్లే స్టోర్ నుంచి పీజీ బీఐఈ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అధ్యాపకులు యాప్‌ను ఓపెన్ చేయగానే వారు ప్రతిరోజు ఉదయం బోధించే తరగతి, విద్యార్థుల వివరాలు కనిపిస్తాయి. విద్యార్థి పేరుపై క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. వెంటనే విద్యార్థి ముఖంపై క్లిక్ చేయగానే విద్యార్థి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఫ విద్యార్థుల హాజరుశాతం పెంచడమే లక్ష్యంగా కొత్త విధానం
ఫ రోజుకు రెండు సార్లు హాజరు
ఫ గైర్హాజరైతే తల్లిదండ్రుల
ఫోన్‌లకు సమాచారం
ఫ అన్ని జూనియర్ కళాశాలల్లో అమలు