
యూరియా అందజేయాలని రైతుల ధర్నా
తుంగతుర్తి : యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో శని వారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. గత 15 రోజుల నుంచి తిరుగుతున్నా ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఎరువుల దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. అవసరంలేని ఎరువులను, మందులను అంటగట్టి తమ ఇష్టానుసారం రేట్లు వేస్తున్నారని ఆరోపించారు. అనంతరం రైతులకు సరిపోను యూరియా అందేలా ఏర్పాట్లు చేయాలని కోరుతూ తహసీల్దార్ దయానందంకు వినతిపత్రం అందజేశారు. వచ్చేనెల 3వ తేదీ వరకు యూరియా వస్తుందని, అప్పటివరకు రైతులు ఓపిక పట్టాలని తహసీల్దార్ సూచించారు. దీంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు తాటికొండ సీతయ్య, గుండగాని రాములు, గాజుల మహేందర్, కోటా రామస్వామి పాల్గొన్నారు.