
పంద్రాగస్టు నాటికి పరిష్కారమయ్యేనా!
అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ఫ అదనపు కలెక్టర్ రాంబాబు
సూర్యాపేట : భూ భారతి అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. మంగళవారం సూర్యాపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. అధికారుల బృందాలకు క్షేత్రస్థాయి వెళ్లాలని కోరారు. అర్హులకు నూతన రేషన్ కార్డును కూడా త్వరగా పంపిణీ చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ సి.హెచ్.కృష్ణయ్య, డీటీ లావణ్య, సీనియర్ అసిస్టెంట్ కపిల్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
సూర్యాపేట : భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి గడువు సమీపిస్తోంది. శతశాతం దరఖాస్తులకు మోక్షం కలిగించాలని ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ తొమ్మిది రోజుల్లో ముగియనుంది. వీటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది కుస్తీలు పడుతున్నారు. అయినా ప్రక్రియ ఏ మాత్రం ముందుకు సాగడంలేదు. ఈ నేపథ్యలో ప్రభుత్వం చెబుతున్న పంద్రాగస్టు నాటికి ఈ దరఖాస్తుల పరిష్కారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూసమస్యల పరిష్కారానికి సుమారు 47వేలకు పైగా దరఖాస్తులు రాగా కేవలం 807కు మాత్రమే మోక్షం కలిగింది.
గడువులోగా అనుమానమే..
భూ సమస్యలతో చాలామంది యజమానులు ఏళ్ల తరబడి కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి వాటికి పరిష్కారం చూపాలని తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చి రెవెన్యూ సదస్సులను నిర్వహించింది. ఈ సదస్సుల్లో దరఖాస్తులను స్వీకరించగా.. ఆగస్టు 15 నాటికి పరిష్కరించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో అధికారులు ఈ దిశగా చర్యలను ముమ్మరం చేసినా.. వేలల్లో దరఖాస్తులు ఉండడం, సిబ్బంది కొరత కారణంగా ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా లేదు. ప్రధానంగా దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉండగా గతంలో ఉన్న వీఆర్‌ఓ, వీఆర్‌ఏల వ్యవస్థ లేకపోవడంతో ఈ పని అంత సులువుగా కావడం లేదు. మోకాపై భూమి ఉన్నప్పటికీ అమ్మిన వ్యక్తి రికార్డుల్లో లేకపోవడం, సర్వే నంబర్‌లోని విస్తీర్ణం పూర్తిగా నిండి ఉండడం, అన్నదమ్ముల్లో ఒకరిపై పట్టా చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం.. ఇలా పలు కారణాలతో దరఖాస్తులు అనర్హతకు గురవుతున్నట్లు తెలిసింది.
ఇప్పటి వరకు 1.70శాతమే పరిష్కారం
ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 47,462 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 47,290 దరఖాస్తులను ఆన్‌లైన్ చేసి రైతులకు నోటీసులను అందించారు. ఇప్పటి వరకు కేవలం 807 దరఖాస్తులకు మోక్షం లభించింది. అంటే 1.70శాతం దరఖాస్తులను మాత్రమే అధికారులు పరిష్కరించగలిగారు. చాలావరకు దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నట్లు తెలుస్తోంది. వీటిని అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు వెల్లడించడం లేదు. సాదాబైనామాతో పాటు పీఓటీ దరఖాస్తులు 17వేల వరకు ఉన్నాయి. ఈ సాదాబైనామాలు, పీఓటీ కేసులు కోర్టు పరిధిలో ఉండడంతో పరిష్కరించే అవకాశం లేకుండా పోయింది. అయితే రెవెన్యూ సిబ్బంది మాత్రం సాదాబైనామా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. వాస్తవంగా రికార్డుల్లో పట్టాదారు ఉన్నాడా..? కాస్తుల్లో కొనుగోలు చేసిన వ్యక్తి ఉన్నారా..? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు వచ్చే లోపు సమగ్రంగా పరిశీలించి జాబితా రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు
భూ భారతి దరఖాస్తుల మోక్షానికి తొమ్మిది రోజులే గడువు
ఫ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు 47,462
ఫ ఇప్పటి వరకు 807 పరిష్కారం
ఫ సిబ్బంది కొరత, అధికంగా అర్జీలు రావడంతో తీవ్ర జాప్యం
ఫ కుస్తీలు పడుతున్న రెవెన్యూ సిబ్బంది
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన
దరఖాస్తులు 47,462
ఆన్‌లైన్ చేసినవి : 47,290
నోటీసులు ఇచ్చినవి : 47,290
పరిష్కారం అయినవి : 807

పంద్రాగస్టు నాటికి పరిష్కారమయ్యేనా!