
నిధులొచ్చాయ్..
త్వరలో పనులు ప్రారంభిస్తాం
పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలకు ఉపాధిహామీ నుంచి నిధులు మంజూరయ్యాయి. ఆయా గ్రామాల్లో స్థలాలను సైతం గుర్తించారు. త్వరలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.
– వి.వి. అప్పారావు, డీఆర్‌డీఓ
నాగారం : గ్రామ పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు సమకూరునున్నాయి. ఆయా భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద నిధులు మంజూరు చేసింది. 20 పంచాయతీ భవనాలు, 19 అంగన్‌వాడీ కేంద్రాలకు కలిపి రూ. 6.28 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే స్థలాలను గుర్తించే ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు పనులకు శ్రీకారం చుట్టడానికి చర్యలు తీసుకోనున్నారు.
రూ.6.28 కోటు విడుదల..
జిల్లాలోని 23 మండలాల పరిధిలో 20 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.4 కోట్లు, 19 అంగన్‌వాడీ కేంద్రాల భవనాలకు రూ. 2.28 కోట్లు మొత్తం కలిపి 32 భవనాలకు రూ.6.28 కోట్ల నిధులు ఉపాధిహామీ పథకం కింద విడుదలయ్యాయి. వీటిలో ఒక్కో పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20లక్షల చొప్పున, అంగన్‌వాడీ భవన నిర్మాణానికి రూ.12లక్షల చొప్పున నిధులు విడుదలయ్యాయి. పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ప్రత్యేక గదులు, ఒక హాల్ తోపాటు మరుగుదొడ్డి, అంగన్‌వాడీ కేంద్రానికి ఒక గది, కిచెన్, మరుగుదొడ్డి నిర్మించనున్నారు.
నేతలు చొరవ చూపాలి..
భవనాల నిర్మాణానికి అధికారులు, నేతలు చొరవ చూపితేనే పనులు ముందుకు సాగే అవకాశముంది. స్థలాలు గుర్తించి నిర్మాణానికి స్థానిక నాయకులు ముందుకొస్తే వెంటనే పనులు ప్రారంభించే అవకాశముందని మండల అధికారులు చెబుతున్నారు. మొదటి, రెండో విడతలో ఏర్పాటైన కొత్త పంచాయతీల్లో భవనాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కమ్యూనిటీ గదులు, చెట్ల కింద సమావేశాలు నిర్వహించాల్సి వస్తోంది.
తీరనున్న అద్దె భారం..
జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 306 పంచాయతీలకు పక్కా భవనాలు ఉన్నాయి. మిగతా 180 అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. పంచాయతీలకు గ్రామీణ ప్రాంతాల్లో అద్దె నెలకు రూ.18వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.25వేల చొప్పున చెల్లిస్తున్నారు. అలాగే జిల్లాలో 1,209 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కేవలం 306 అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రమే సొంతభవనాలున్నాయి. 452 కేంద్రాలు అద్దె భవనాల్లో, 451 ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రతినెలా గ్రామాల్లో రూ.1,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2వేలకు పైగా అద్దె చెల్లించడం ప్రభుత్వానికి భారంగా మారింది. త్వరలో 19 భవనాలు నిర్మించనుండడంతో అద్దె భారం తగ్గనుంది.
ఫ పంచాయతీలు, అంగన్‌వాడీల సొంత
భవన నిర్మాణానికి రూ.6.28కోట్లు
ఫ ఉపాధి హామీ పథకం కింద నిధులు
ఫ స్థలాలు గుర్తించే ప్రక్రియ పూర్తి
ఫ తీరనున్న అద్దె భారం
గ్రామ పంచాయతీలు 486
అంగన్‌వాడీ కేంద్రాలు 1,209
నిధులు మంజూరైన
పంచాయతీలు 20
అంగన్‌వాడీ కేంద్రాలు 19
పంచాయతీ భవన నిర్మాణ
ఖర్చు: రూ.20 లక్షలు
అంగన్ వాడీ భవనానికి రూ.12 లక్షలు

నిధులొచ్చాయ్..