
గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా..
ఫ ‘ధర్తి ఆభ జన్‌భాగీధారీ అభియాన్’ను తీసుకువచ్చిన కేంద్రం
ఫ మౌలిక సదుపాయాల కల్పన,
సామాజిక భద్రతా పథకాలపై
అవగాహన కల్పించాలని నిర్ణయం
ఫ గిరిజన తండాల్లో కొనసాగుతున్న
ఇంటింటి సర్వే
గిరిజనుల జీవన
ప్రమాణాలు మెరుగుపడతాయి
గిరిజనాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన దర్తి ఆభ జన్ భాగీధారీ అభియాన్’ ద్వారా గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ప్రస్తుతం మఠంపల్లి మండలంలోని పలు గిరిజన తండాల్లో ఈ సర్వే కొనసాగుతోంది. సర్వేలో సేకరించిన వివరాలన్నింటినీ ఆన్‌లైన్ చేస్తున్నాం. తద్వారా ప్రభుత్వం గిరిజనులకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తుంది.
– వెంకటేశ్వర్లు,
లైజనింగ్ ఆఫీసర్, మఠంపల్లి మండలం
మఠంపల్లి: గిరిజన ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ధర్తి ఆభ జన్‌భాగీదారీ అభియాన్ పథకాన్ని తీసుకువచ్చింది. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కొద్దిరోజులుగా సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ (డీటీడీఓ) ఆధ్వర్యంలో అత్యధికంగా గిరిజన తండాలు గల మఠంపల్లి, పాలకీడు, మేళ్లచెరువు, అనంతగిరి, నేరేడుచర్ల, చివ్వెంల, తుంగతుర్తి, తిరుమలగిరి, ఆత్మకూరు(ఎస్) మండలాల్లో ఈనెల 6 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించారు. ఈసర్వే ఈనెల 19 వరకు కొనసాగనుంది. ఈ పథకాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ఇంటింటి సర్వే ఎలా చేపట్టాలి అనేదానిపై రామచంద్రాపురంతండా, భీమ్లాతండా, భోజ్యాతండా, సుల్తాన్‌పూర్‌తండా, గుర్రంబోడు తండా, క్రిష్ణాతండా, తదితర గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులకు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వలంటీర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. దీంతో వారు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేది ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, కిసాన్ కార్డ్, ఫసల్‌బీమా పొందుతున్నారా లేదా, ప్రభుత్వ ఇల్లు మంజూరు అయిందా కాలేదా తదితర 40అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే వివరాలన్నింటినీ ఆన్‌లైన్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పథకం లక్ష్యాలు
ఫ గిరిజన గ్రామాల్లో విద్యుద్దీకరణ,
ఇంటర్నెట్ కనెక్టివిటీని మెరుగుపరచడం.
ఫ గిరిజన ప్రజలకు ఆధార్‌కార్డు, ఆయుష్మాన్ భారత్‌కార్డు, పీఎం కిసాన్ పథకం, జన్‌ధన్ ఖాతా, స్కాలర్‌షిప్ వంటి సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పిస్తారు.
ఫ మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించడం.

గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా..