
9,23,449 ఎకరాలకు నీరు
ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రణాళిక ఖరారు
వరద పెరిగితే 20వ తేదీ నుంచి నీటి విడుదల
ప్రస్తుతం వర్షాలు తక్కువగా ఉండటంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వస్తున్న వరదనీరు (ఇన్‌ఫ్లో) 60 వేల క్యూసెక్కుల వరకు తగ్గిపోయింది. ఈ నాలుగైదు రోజుల్లో వర్షాలు పెరిగి శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇన్‌ప్లో ఎక్కువగా ఉంటే ఈ నెల 20వ తేదీ నుంచి ఎడమకాల్వకు నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే ఆగస్టు 1వ తేదీ నుంచి సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వానాకాలం సీజన్‌లో ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటి విడుదల ప్రణాళికను రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ ఖరారు చేసింది. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ, ఆసిఫ్‌నహర్, డిండి, ఎస్సారెస్పీ స్టేజ్– 2, మూసీ, ఎత్తిపోతల పథకాల కింద వానాకాలంలో మొత్తం 9,23,449 ఎకరాల్లో పంటల సాగుకు నీటిని విడుదల చేసేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీటిని వృథా చేయకుండా ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆయా ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు వరకు నీటిని అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు జిల్లాలోని సాగునీటి పారుదల శాఖ అధికారులు షెడ్యూల్ ఖరారు చేసి నీటిని విడుదల చేయనున్నారు.
నీటి కేటాయింపులు ఇలా..
● నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద నల్లగొండ జిల్లాలో1,44,727 ఎకరాల ఆయకట్టు ఉండగా.. వానాకాలం సాగకు 16.50 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇక ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ కింద 2,76,461 ఎకరాల ఆయకట్టు ఉండగా.. 28 టీఎంసీల నీటికి ఇవ్వనున్నారు.
● ఆసిఫ్‌నహర్ కింద 15,245 ఎకరాలకు 1.5 టీఎంసీల నీరు కేటాయించారు.
● డిండి ప్రాజెక్టు కింద 12,975 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించిన కమిటీ వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా ఎంత నీటిని విడుదల చేయాలన్నది నిర్ణయించాలని స్పష్టం చేసింది. నీటి కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
● సూర్యాపేట జిల్లాలో సాగర్ ఎడమకాల్వ కింద ఎత్తిపోతల పథకాలతో కలుపుకుని 2,29,961 ఎకరాల ఆయకట్టు ఉండగా వానాకాలం సాగుకు 18 టీఎంసీల నీటిని కేటాయించింది.
● ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద సూర్యాపేట జిల్లాలో 2,14,080 ఎకరాలకు నీటిని ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా ఎంత నీటిని విడుదల చేయాలన్నది ఖరారు చేయాలని సూచించింది.
● మూసీ ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలకు 4.28 టీఎంసీల నీటిని ఇవ్వాలని నిర్ణయించింది.
ఫ సాగర్, మూసీ, ఎస్సారెస్పీ, ఏఎమ్మార్పీ, ఎత్తిపోతల పథకాల కింద నీరు
ఫ ఆన్ ఆఫ్ పద్ధతిలో నీరివ్వాలని
సూచించిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ
ఫ ఎస్సారెస్పీ, డిండి కింద ఇన్‌ఫ్లో ఆధారంగా నీటి విడుదల
ఫ సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరిగితే ఈ నెల 20న, లేదంటే ఆగస్టు 1న ఎడమకాల్వకు నీరు