
‘స్థానిక’ స్థానాలు ఖరారు
సూర్యాపేట : జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాల వారీగా స్థానాలను ఖరారు చేసి జాబితాను వెల్లడించింది. దీంతోపాటు స్థానిక పోరుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు సైతం అందాయి.
జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు
స్థానిక సంస్థల స్థానాలు ఖరారు కావడంతో గ్రామాల్లో ఎన్నికల సమరభేరీ మోగనుంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు కావాల్సిన మెటీరియల్, అధికారులు, సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ, డీపీఓలు, పోలీస్‌శాఖకు ఆదేశాలు అందాయి.
ఫ జిల్లాలో 23 చొప్పున జెడ్పీటీసీలు,
ఎంపీపీలు, 235 ఎంపీటీసీలు
ఫ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఫ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు
గతంలో మాదిరిగానే..
2019లో జరిగిన ఎన్నికల సమయంలో జిల్లాలో 23 చొప్పున జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. కొత్తగా మండలాలు ఏర్పాటు కాకపోవడంతో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇటీవల ఎంపీటీసీల నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పటికీ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఎంపీటీసీ స్థానాల్లోనూ ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో జిల్లాలో గతంలో ఉన్న 235 స్థానాలకు అవే స్థానాలు ఉన్నాయి.