
విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్పీ కె. నరసింహ అన్నారు. గురువారం ఆత్మకూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చెడు స్నేహాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువు పట్ల శ్రద్ధ చూపాలన్నారు. ఆకతాయిల వేధింపులకు గురైతే 100కు గాని, షీ టీం 87126 86056 నంబర్‌కుగాని ఫిర్యాదు చేయాలని తెలిపారు. దృఢ సంకల్పంతో ఉన్నత చదువులు చదవాలని, మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య లాంటి తప్పులు చేయొద్దని బాలికలకు సూచించారు. బాలికలు తమ ఫొటోలను, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల సమస్యలు ఎదురవుతాయన్నారు. సోషల్ మీడియా ప్రభావం తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ రాజశేఖర్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ ఎంఈఓ ధారాసింగ్, ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్, రూరల్ ఎస్సై బాలు నాయక్, కస్తూర్బా ఎస్‌ఓ సరస్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ