
అంగన్‌వాడీల్లో పోస్టుల భర్తీకి సన్నాహాలు
నాగారం : చిన్నారులకు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య, వారికి అవసరమైన పౌష్టికాహారం అందించడం, గర్భిణులు, బాలింతలకు అవసరమైన ఆరోగ్య సలహాలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిని మరింత బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఖాళీల భర్తీకి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఇటీవల రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించడంతో ఈ ప్రక్రియ వేగం పుంజుకోనుంది.
ఇన్‌చార్జిలతో ఇబ్బందులు..
ప్రస్తుతం ఖాళీలు ఉన్న కేంద్రాల బాధ్యతలను సమీపంలోని టీచర్‌కు అప్పగించారు. అయితే వీరు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. నిత్యం అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన విద్యార్థుల హాజరు, గర్భిణులు, బాలింతల సంఖ్య, పౌష్టికాహారం వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న వారు తమ పరిధిలోని రెండు కేంద్రాల వివరాలు ఆన్‌లైన్ చేయడంలో ఆలస్యమవుతోంది. దీంతో కేంద్రానికి సంబంధించిన పౌష్టికాహారం సమయానికి రాకపోవడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. కేంద్రానికి ఒక టీచర్‌ను నియమించడంవల్ల ఇబ్బందులు తొలగుతాయి.
కార్యాచరణ రూపకల్పన
జిల్లా వ్యాప్తంగా 5 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా వీటి పరిధిలోని 1,209 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్, సహాయకుల పోస్టులను గుర్తించారు. జిల్లాలో 78 టీచర్, 274 సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పోస్టుల భర్తీకి కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో అంతకు ముందే పోస్టులను భర్తీచేయడం సరికాదని ప్రభుత్వం జాప్యం చేస్తోంది. వర్గీకరణ అంశం కొలిక్కి రాగానే నెలరోజుల్లో పోస్టులను భర్తీ చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఖాళీల వివరాలు సేకరించింది. నోటిఫికేషన్ ఇవ్వడమే తరువాయి. గతంలో ఇంటర్ మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేశారు. ఇప్పుడు అలాగే చేస్తారా లేక రాత పరీక్ష నిర్వహిస్తారా అన్నది తేలాల్సి ఉంది.
ఫ 83 టీచర్, 287 ఆయా పోస్టులు ఖాళీ
ఫ ప్రభుత్వానికి వివరాలు పంపిన అధికారులు
ఖాళీల వివరాలు అందజేశాం
జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు అందజేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తాం.
– దయానందరాణి,
జిల్లా ఇన్‌చార్జి సంక్షేమ అధికారి
ప్రాజెక్టులు 05
అంగన్‌వాడీ కేంద్రాలు 1,209
చిన్నారులు 45,177
గర్భిణులు 5,220
బాలింతలు 4,236
అంగన్‌వాడీ టీచర్ల ఖాళీలు 83
సహాయకుల ఖాళీలు 287