మహిళా సంఘంలో అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘంలో అక్రమాలు

Jul 7 2025 6:46 AM | Updated on Jul 7 2025 6:46 AM

మహిళా సంఘంలో అక్రమాలు

మహిళా సంఘంలో అక్రమాలు

పాలకవీడు: పాలకవీడు మండలం ముసిఒడ్డుసింగారం గ్రామ పరిధి రోళ్లవారిగూడెం గ్రామంలోని దిల్వాలా మహిళా సంఘంలో అక్రమాలు వెలుగుచూశాయి. ఖాతాలోని పొదుపు డబ్బులు మాయం కావడంతో సంఘం సభ్యులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వీఓఏ రూ.10వేలు వాడుకున్నట్లు తేలడంతో విచారణకు ఆదేశించారు.

కనిపించని 11 ఏళ్ల పొదుపు డబ్బు

గ్రామంలోని దిల్వాలా సంఘం మహిళలు గత 11 సంవత్సరాలుగా ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున పొదుపు చేస్తూ వచ్చారు. అయితే వారి ఖాతాలో పొదుపు డబ్బులు రూ.లక్షా పదివేలు మాయమయ్యాయి. అంతేకాకుండా రూ.2లక్షల లోన్‌ తీసుకోకున్నా తీసుకున్నట్లు చూపిస్తోందని గత 20 రోజుల క్రితం సంఘం సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ వేసి నిజానిజాలు తేల్చాలని కోరారు. ఈమేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో డీపీఎం విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా లోన్‌ విషయంలో వీఓఏ రూ.10వేలు అక్రమంగా వాడుకున్నట్లు తేల్చి రికవరీకి ఆదేశించారు.

మినిట్స్‌ బుక్‌లో తప్పుగా నమోదు

మినిట్స్‌ బుక్‌లో వాస్తవిక లావాదేవీలకు భిన్నంగా డేటాను నమోదు చేస్తున్నారని, అప్పు పూర్తిగా చెల్లించినా ఇంకా మిగిలిందంటూ తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ సంఘం సభ్యులు వాపోతున్నారు. వీఓఏ సంఘం సభ్యులను సంప్రదించకుండానే తీర్మానాలు రాస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా సీఐఎఫ్‌, శ్రీనిధి, ఎస్‌బీ ఇలా అన్ని రకాల రుణాల్లో అక్రమాలు జరిగినట్లు సభ్యులు పేర్కొంటున్నారు. అసలు ఇన్ని అక్రమాలు జరుగుతున్నా విచారణకు వచ్చిన అధికారులు అవేమీ తేల్చకుండా నామమాత్రపు విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారని వాపోయారు. ఈమేరకు గత సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు.

సంఘానికి సంబంధించి పొదుపు డబ్బులు మాయం కావడంతో

కలెక్టర్‌కు ఫిర్యాదు

వీఓఏ రూ.10వేలు

వాడుకున్నట్లు విచారణలో వెల్లడి

రికవరీకి ఆదేశించిన డీపీఎం

విచారణ పూర్తయింది

మహిళా సంఘాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న సభ్యులు ఎవరైనా అవినీతికి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. ముసిఒడ్డు సింగారం గ్రామ పరిధి రోళ్లవారిగూడెంలోని దిల్వాలా సంఘంలో అవకతవకలు జరగడంపై ఇటీవల డీపీఎం ఇటీవల విచారణ చేపట్టారు. వీఓఏ అక్రమంగా డబ్బులు వాడుకున్నట్లు తేలింది. రికవరీకి ఆదేశించారు.

– దుర్గాప్రసాద్‌, ఏపీఎం,

పాలకవీడు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement