
వన మహోత్సవానికి సన్నద్ధం
భానుపురి (సూర్యాపేట) : వన మహోత్సవానికి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. సమృద్ధిగా వర్షాలు వర్షాలు పడడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలు రాగానే మొక్కలు నాటేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో గుంతలు తీసే పనులను ఇప్పటికే ప్రారంభించారు. ఈ సారి జిల్లాలో సుమారు 59.88 లక్షల మొక్కలు నాటాలని వివిధ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం విధించింది. నిర్దేశించిన లక్ష్య సాధనకు ఆయా శాఖలకు ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
లోటు వర్షపాతం కారణంగా..
ఈ ఏడాది మే చివరి వారంలోనే వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో సమృద్ధిగా వర్షాలు పడతాయని అంతా భావించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కూడా వర్షాలు కురిసిన సమయంలోనే మొక్కలు నాటితే బాగుంటుందన్న అభిప్రాయంతో ముందస్తుగానే జూన్ మాసంలోనే మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే జూన్ మాసంలో దాదాపు అన్ని మండలాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో మొక్కలు నాటేందుకు వెనుకడుగు వేశారు. ఈనెలలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వ ఆదేశాలు ఎప్పుడు వస్తే అప్పుడు మొక్కలు నాటనున్నారు. జిల్లాలో డీఆర్‌డీఓ, ఎంపీడీఓ విభాగం అత్యధికంగా 28.87 లక్షల మొక్కలు నాటనుంది. తదనంతరం మున్సిపల్ శాఖ 15.53 లక్షలు, ఫారెస్ట్ 4.32 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. ఇవే కాకుండా ప్రభుత్వం అన్నిశాఖలకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా కసరత్తు చేస్తున్నాయి.
1,55,543
గుంతల తీత..
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటికే 1,55,543 గుంతలను జిల్లావ్యాప్తంగా కూలీలతో తీయించారు. అత్యధికంగా నాగారం మండలంలో 19,100 గుంతలు, అనంతగిరి మండలంలో 11,470 గుంతలు, గరిడేపల్లి మండలంలో 11,280 గుంతలు తీశారు. అత్యల్పంగా హుజూర్‌నగర్ మండలంలో కేవలం 575 గుంతలు తీయించారు. రోడ్ల వెంట నీడనిచ్చె మొక్కలతో పాటు పండ్ల మొక్కలు నాటనున్నారు. అలాగే జిల్లాలోని పల్లె ప్రకృతి వనాల్లో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో 3 అడుగులకు పైగా ఉన్న మొక్కలను నాటనున్నారు. ఇక పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మునగ, కరివేపాకు, ఉసిరి, మారేడు, వెలగ మొక్కలు నాటాలని నిర్ణయించారు.
వర్షాలు కురవగానే నాటిస్తాం
జిల్లాలో వన మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది లక్ష్యాన్ని చేరుకునేలా వివిధ శాఖలకు సూచనలు చేశాం. ఈ మేరకు ఇప్పటికే మొక్కలు నాటేందుకు గుంతలు తీయిస్తున్నాం. వర్షాలు కురిస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు మొక్కలు నాటిస్తాం.
– వి.వి.అప్పారావు, డీఆర్‌డీఓ
ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో గుంతలుతీసే పనులు ప్రారంభం
ప్రభుత్వ ఆదేశాలు రాగానే
మొక్కలు నాటేలా ప్రణాళిక
59.88 లక్షల మొక్కలు
నాటనున్న వివిధ శాఖలు
శాఖ లక్ష్యం (లక్షల్లో)
ఫారెస్ట్ 4.32
డీఆర్‌డీఏ/ఎంపీడీఓ 28.87
ఎడ్యుకేషన్ 45వేలు
ఆర్‌అండ్‌బీ 50వేలు
ఇరిగేషన్ 2.57
అగ్రికల్చర్ 3.83
హార్టికల్చర్ 38వేలు
ఎకై ్సజ్ 94వేలు
రెవెన్యూ 1.00
మున్సిపల్ 15.53
హెల్త్ 22వేలు
పోలీస్ 27వేలు
ఇండస్ట్రీస్ 60వేలు
సోషల్ వెల్ఫేర్ 7500
ట్రైబల్ వెల్ఫేర్ 10వేలు
బీసీ వెల్ఫేర్ 4500
మైనార్టీ వెల్ఫేర్ 7500
పశువైద్యశాఖ 7500
మొత్తం 59.88లక్షలు

వన మహోత్సవానికి సన్నద్ధం

వన మహోత్సవానికి సన్నద్ధం