
ఫార్మర్ రిజిస్ట్రీ @ 14,221
నెల రోజుల్లో పూర్తిచేస్తాం
రైతు రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. క్లస్టర్ల వారీగా ఏఈఓలు రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నెలరోజుల్లో పూర్తి చేస్తాం. గతంలో ధరణి పోర్టల్‌లో రైతుల సమాచారం ఉండడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభమవుతుంది. మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా రైతులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు ఇకనుంచి ఈ ఐడీతోనే అందుతాయి.
– జి.శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి, సూర్యాపేట
తాళ్లగడ్డ (సూర్యాపేట) : రైతులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆధార్ తరహాలో 11 అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డు (యూనిక్ ఐడీ) ఇవ్వాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా జిల్లాలో రైతుల నమోదు కార్యక్రమంపై ఈనెల 5వ తేదీన రెవెన్యూ క్లస్టర్ల వారీగా ఏఈఓలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ఈనెల 13న రైతుల పేర్ల రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియను ప్రారంభించగా ముమ్మరంగా కొనసాగుతోంది. కాగా శనివారం వరకు 14,221 మంది రైతుల వివరాలను నమోదు చేశారు. ఇందులో 7,442 మంది రైతుల రిజిస్ట్రేషన్లను కేంద్ర అప్రూవల్ చేసింది. వీరికి ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పట్టాదారు పాసు పుస్తకంలోని భూ యాజమాన్య వివరాల నమోదు చేసి విశిష్ట కార్డులను కేటాయిస్తున్నారు. ఈ ఐడీ ప్రామాణికంగా భవిష్యత్‌లో రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తింపజేయనున్నారు.
82 కస్టర్ల పరిధిలో నమోదు ప్రక్రియ
జిల్లాలోని 82 రెవెన్యూ క్లస్టర్ల పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తూ.. వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. అన్నదాతలు తమ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానం చేసిన సెల్‌నంబర్‌తో ఏఈఓల వద్దకు వెళ్లి నమోదు చేసుకోసుకుంటున్నారు. వివరాలు నమోదు చేసిన తర్వాత సెల్‌కు మూడు సార్లు ఓటీపీ వస్తుంది. ఓటీపీని రైతు ఏఈఓకు చెబితే నమోదు పూర్తయి సదరు రైతుకు 11 అంకెల యూనిక్ ఐడీ జనరేట్ అవుతుంది. ఇప్పటి వరకు అప్రూవల్ అయిన రైతులకు కార్డుల జారీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
ఫ పన్నెండు రోజులుగా కొనసాగుతున్న రైతుల వివరాల నమోదు ప్రక్రియ
ఫ ఇప్పటి వరకు అప్రూవల్ అయినవి 7,442 రిజిస్ట్రేషన్లు
ఫ ఆధార్ తరహాలో విశిష్ట కార్డులు
అందజేత
ఫ భవిష్యత్‌లో రైతు పథకాలన్నింటికీ ఇదే ప్రామాణికం

ఫార్మర్ రిజిస్ట్రీ @ 14,221

ఫార్మర్ రిజిస్ట్రీ @ 14,221