
ఇంగ్లిష్ సబ్జెక్ట్ క్రెడిట్స్ తగ్గింపు సరికాదు
రామగిరి(నల్లగొండ): రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు కేటాయించిన 20 క్రెడిట్స్‌ను 12కు తగ్గించాలనే ప్రతిపాదన సరికాదని, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి విరమించుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) ఇంగ్లిష్ విభాగం అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంజీయూ ఇంగ్లిష్ విభాగం అధిపతి అరుణప్రియ అధ్యక్షతన జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంగ్లిష్ అధ్యాపకులతో అత్యవసర సమావేశం నిర్వహించి, ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చేసిన తీర్మానాన్ని ఎంజీయూ వైస్ చాన్స్‌లర్ అల్తాఫ్ హుస్సేన్, డీన్ కె. అంజిరెడ్డికి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రెడిట్స్ తగ్గించే నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇంగ్లిష్ భాష ప్రాధాన్యతను గుర్తించి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటే, రాష్ట్రంలో మాత్రం ఇంగ్లిష్ భాషకు ప్రాధాన్యత తగ్గించేలా ఉన్నత విద్యామండలి ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్నారు. ఒకవైపు రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ డిగ్రీ విద్యార్థులకు వివిధ నైపుణ్యాలను నేర్పిస్తామంటూ, మరోపక్క ఇంగ్లిష్‌కు ప్రాధాన్యత తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ఇంగ్లిష్ అధ్యాపకులు ఈ. రాంరెడ్డి, చైతన్య, సుధ, చిలుముల సుధాకర్, హరికృష్ణ, వెంకట్, ప్రభాకర్, రేణుక తదితరులు పాల్గొన్నారు.