
దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి
మునగాల : దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ అన్నారు. ఆదివారం మునగాల మండలం కలకోవలో నిర్వహించిన ఆ సమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్కను కోరినట్లు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు అనేక హామీలు ఇచ్చి వారి ఓట్లను కొల్లగొట్టి సీఎంగా గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డికి తెలంగాణలో 30లక్షల మంది దివ్యాంగులు పడుతున్న బాధలు కనిపించకుండాపోవడం బాధాకరమన్నారు. దివ్యాంగులకు పెన్షన్ రూ.6వేలకు పెంచడంతో పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్రంలో బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు. సంఘం మండల శాఖ అధ్యక్షుడు గోపిరెడ్డి మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోగుల శేఖర్‌రెడ్డి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా యువజన విభాగం నాయకులు గుంటి శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు మున్న మధుయాదవ్, తూర్పాటి చిన్నవెంకన్న పెద్దవెంకన్న, భువనగిరి భద్రయ్య, బండారు నాగరాజు, మద్దెల గోపయ్య, సంఘం మహిళా నాయకురాలు పాలబిందెల శ్వేత తదితరులు పాల్గొన్నారు.