తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా ప్రతి సంవత్సరం విద్యా శాఖ బడిబాట కార్యక్రమం చేపడుతుంది. 15 రోజుల పాటు నిర్వహించే బడి బాటలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు, ఉచితంగా అందజేస్తున్న అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు బడి బాట కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే గ్రామాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశమై ప్రభుత్వ పాఠశాలల్లో బోధన తీరు, వసతుల గురించి వివరించారు.
ప్రత్యేక కార్యక్రమాలు ఇలా..
● జూన్ 6వ తేదీన గ్రామ సభలు నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల పని తీరుపై అవగాహన కల్పించాలి.
● 7వ తేదీన ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లల వివరాలు సేకరించాలి.
● 8 నుంచి 10వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి కపత్రాలతో ప్రచారం నిర్వహించాలి. అంగన్‌వాడి కేంద్రాల్లో పోస్టర్లు అతికించాలి. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించాలి. పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల పిల్లలను భవిత కేంద్రాల్లో చేర్పించేందుకు ప్రాధాన్యమివ్వనున్నారు.
● 11న జూన్ 6 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష
● 12వ తేదీన అమ్మ ఆదర్శ బడుల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రారంభించనున్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేయనున్నారు. స్కూల్ యూనిఫామ్ ఇవ్వనున్నారు.
● 13వ తేదీన సామూహిక అక్షరాభ్యాసం, గ్రామ సభ నిర్వహించనున్నారు.
● 16న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్), లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ దినోత్సవం జరపనున్నారు. అన్ని తరగతి గదుల్లో సబ్జెక్టుల వారీగా అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించనున్నారు. పిల్లలు రూపొందించిన వివిధ చార్టులతో గదులను అలంకరించనున్నారు. చదవడం, గణిత సంబంధిత అంశాలపై ఎఫ్‌ఎల్‌ఎన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తారు.
● 17న సమీకృత విద్య, బాలిక విద్యా దినోత్సవం నిర్వహిస్తారు. బాలికల వివాహాలు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలి.
● 18వ తేదీన తల్లిదండ్రులను, గ్రామస్తులను ఆహ్వానించి తరగతి గదుల డిజిటలైజేషన్, ఇతర ఆధునీకరణ సౌకర్యాలు చూపిస్తారు.
● 19న బడి బయట కార్యక్రమం ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ప్రవేశాల పెంపే లక్ష్యంగా ఉపాధ్యాయులు క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టనున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పుస్తకాలను సిద్దం చేస్తున్నారు.
ఉపాధ్యాయులకు శిక్షణ
జిల్లాలో బడి బాట తరహా కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదేశం మేరకు ఏప్రిల్ 23వ తేదీ నుంచి ముందస్తుగా కొనసాగిస్తున్నప్పటికీ జూన్‌లో మరోసారి చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో ముందస్తు ప్రత్యేక ప్రణాళికతో అధికారులు ముందుకు వెళుతున్నారు. బడిబాట నేపథ్యంలో మంగళవారం నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది ఐదు రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ అనంతరం ఉపాధ్యాయులు గ్రామస్తులను చైతన్యం చేయనున్నారు.
ఫ జూన్ 6 నుంచి బడి బాట
ఫ ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన
ఫ ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం