
నారసింహుడికి లక్ష మల్లెల పూజ
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణోత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా యాజ్ఞీకులు బొర్రా వెంకట వాసుదేవాచార్యులు, సోమయాజుల సూర్యనారాయణ మూర్తిశాస్త్రి, లక్ష్మీనరసింహమూర్తి జానపాటి సీతారామశాస్త్రి ఆధ్వర్యంలో లక్షమల్లెలతో అర్చనలు పూర్తిచేశారు. అనంతరం స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించి కల్యాణానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన టీవీ కళాకారుడు ధూళిపాళ శివరామకృష్ణయ్యభాగవతార్, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శ్రీరామతీర్థ సేవాశ్రమ పీఠం భక్తులు ప్రదర్శించిన నాదస్వర కచేరీ, భక్తి సంగీతం, ససంగీత విభావరి నాదలహరి, శ్రీసీతా కల్యాణం హరికథ, శ్రీలక్ష్మీనృసింహ నామ సంకీర్తనలతోపాటు దాచేపల్లి, చౌటపల్లి, పెదవీడు, చెన్నాయిపాలెం, మాచవరం గ్రామాలకు చెందిన కోలాట, భజనలు ఆకట్టుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు స్వామివారి తిరుకల్యాణోత్సవం జరుగనుందని ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్ తెలిపారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు , భక్తులు పాల్గొన్నారు.
ఫ మట్టపల్లిలో రెండో రోజుకుచేరిన తిరుకల్యాణోత్సవాలు

నారసింహుడికి లక్ష మల్లెల పూజ