
భువనగిరి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న దరఖాస్తుదారులు
సాక్షి, యాదాద్రి: భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల లక్కీడ్రా తీవ్ర ఉద్రిక్తత నడుమ కొనసాగింది. సింగన్నగూడెం వద్ద నిర్మించిన 444 ఇళ్లకు రెవెన్యూ అధికారులు 3,415 దరఖాస్తులను స్వీకరించి 1,950 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 444 మందిని ఎంపిక చేయడానికి అధికారులు కలెక్టరేట్‌లో డ్రా చేపట్టారు. అయితే అర్హుల జాబితాను వార్డుల్లో ప్రకటించకుండా తొందరగా ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. వీరి అరెస్టుల అనంతరం అధికారులు, బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసుల పహారాలో లబ్ధిదారుల లక్కీడ్రా ప్రారంభించి రాత్రి 8 గంటలకు పూర్తి చేశారు.
ప్రతిపక్ష నాయకుల ధర్నా
జాబితాను వార్డుల్లో ప్రదర్శించకుండా ఏకపక్షంగా ఆగమేఘాలమీద డ్రా తీయడం ఏంటని ప్రతిపక్షాల నాయకులు, కౌన్సిలర్లు డ్రా తీస్తున్న అధికారుల ఎదుట ఆందోళన చేపట్టారు. అధికారుల పోడియం ఎదుట ఽమెరుపు ధర్నాకు దిగారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను వార్డుల్లో ప్రకటించకుండా తొందరగా ఎంపిక చేయడంపై ప్రతిపక్షాల కౌన్సిలర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అర్హుల జాబితాలో అనర్హులు ఉన్నారని, వారిని గుర్తించే వీలులేకుండా అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరించారని కాంగ్రెస్, బీజేపీ ఫ్లోర్ లీడర్లు పోత్నక్ ప్రమోద్‌కుమార్, మాయ దశరథలు ఆరోపించారు. అఖిలపక్షం నాయకులు, ప్రతిపక్ష కౌన్సిలర్లు కలెక్టరేట్‌లో ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని బయటకు పంపించారు. దీంతో కలెక్టరేట్ ఎదుట భువనగిరి– వరంగల్ రహదారిపై దరఖాస్తుదారులతో కలిసి ఆందోళనకు దిగారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లను బహిరంగంగా వార్డుల వారీగా డ్రా పద్ధతిలో కేటాయించాలని దరఖాస్తు దారులు డిమాండ్ చేశారు. సుమారు నాలుగు గంటల పాటు ఆందోళన చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
ఇబ్బంది పడిన సిబ్బంది, ప్రజలు
పోలీసుల అత్యుత్సాహంతో కలెక్టరేట్ వచ్చిన వారు ఇబ్బంది పడ్డారు. వివిధ పనుల కోసం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆలేరు మండలంలోని ఓ వ్యక్తి రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వస్తే లోనికి అనుమతించలేదు. కార్యాలయానికి వ్యక్తిగత పనుల కోసం వచ్చిన వారినీ సైతం లోనికి వెళ్లనివ్వలేదు. దీంతో ప్రధాన గేటు ఎప్పుడు తీస్తారోనని మండుటెండలోనే నిలబడ్డారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి కూడా అలానే మారింది.
ఫ వివాదాస్పదంగా మారిన భువనగిరి జిల్లా కేంద్రంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
ఫ అధికారపార్టీకి అనుకూలంగా ఎంపిక చేశారని ప్రతిపక్షాల ఆందోళన
ఫ కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన
దరఖాస్తుదారులు
ఫ పోలీసుల పహారాలో లబ్ధిదారుల
లక్కీడ్రా పూర్తి చేసిన అధికారులు
కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన దరఖాస్తుదారులు
బుధవారం ఉదయం డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత అధికారులు కౌన్సిలర్లకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న దరఖాస్తుదారులంతా కలెక్టరేట్‌కు తరలివచ్చారు. దీంతో కలెక్టరేట్‌లోకి కేవలం మున్సిపల్ కౌన్సిలర్లు, అఖిలపక్షాల నాయకులు, అధికారులను మాత్రమే అనుమతించారు. మిగతావారు కార్యాలయంలోనికి రావొద్దని చెప్పడంతో పోలీసులు దరఖాస్తుదారులను అడ్డుకున్నారు.