గంజాయి ముఠా కిరాతకం | - | Sakshi
Sakshi News home page

గంజాయి ముఠా కిరాతకం

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

గంజాయి ముఠా కిరాతకం

● పాతపట్నం నియోజకవర్గంలో ఘటన

● గంజాయి బ్యాచ్‌ ఆగడాలపై పోలీసులకు సమాచారం ఇచ్చిన సామాన్య వ్యక్తి

● ఆ వ్యక్తిపై దాడికి తెగబడిన గంజాయి బ్యాచ్‌

● చెట్టుకు కట్టి విచక్షణరహితంగా దాడి

● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బాగోతం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

శ్రీకాకుళం జిల్లాలో గంజాయి ప్రభావం రోజు రోజుకూ హద్దులు దాటి పోతోంది. కొంత మంది ముఠాలుగా తయారై ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసే స్థాయికి అక్రమ వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఎవరైనా పోలీసులకు సమాచారం ఇస్తే వారిపై కాపు కాసి మరీ దాడులు చేస్తున్నారు. ఇలాంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా జిల్లాకు ఒడిశా దగ్గరగా ఉండడం.. మారు మూల ఒడిశా ప్రాంతంతో జిల్లాకు అనేక అక్రమ మార్గాలు ఉండడంతో ఈ గంజాయి అక్రమ రవాణాకు అన్ని రకాలుగా మార్గం అనుకూలంగా మారుతోంది. అయితే ఎప్పటికప్పుడు గంజాయి రవాణా పోలీసులకు చిక్కుతున్నప్పటికీ, అవి ఇతర ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే పట్టుబడుతున్నారు తప్పా, జిల్లాకు చెందిన గంజాయి బ్యాచ్‌ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు.

ఇంటిదొంగలెవరు..!

జిల్లా పోలీస్‌ అధికారి ప్రత్యేక నిఘా వేస్తున్నప్పటికీ ఆయా శాఖలో మాత్రం కొంత మంది గంజాయి బ్యాచ్‌కు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గత కొన్ని నెలల క్రితం పాతపట్నం నియోజకవర్గంలో బహిరంగంగా జరిగిన సంఘటనను కొంత మంది ప్రమేయంతో దాచాలని చూసినప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒడిశా ప్రాంతం బినలా పరిసర ప్రాంతాల నుంచి కొసమాల మీదుగా కొంత మంది గంజాయి బ్యాచ్‌ అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని కొసమాల గ్రామానికి చెందిన హైదరాబాద్‌లో వలస కార్మికుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులకు ఇచ్చిన సమాచారం గంజాయి ముఠాకు చేరింది. అంతే సమాచారం ఇచ్చిన వ్యక్తి పాతపట్నంలో బస్సు దిగే సమయంలో కాపు కాసి దాడి చేశారు. అక్కడితో విడిచిపెట్టకుండా మోటారు సైకిల్‌పై బలవంతంగా తీసుకువెళ్లి కొసమాల

గ్రామంలో చెట్టుకు కట్టి మరీ విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. గ్రామానికి రానివ్వకుండా హుకుం జారీ చేశారు. ఈ సంఘటన తెలిసిన పోలీసులు మాత్రం ఎందుకో సైలెంట్‌ పాత్ర వహించడంతో బాధితుడు చికిత్స పొందుతూ ప్రాణ భయంతో హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. ఒడిశాకు ఆనుకుని ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో గంజాయి రవాణా, ఆయా ముఠాల ప్రాబల్యం ఉన్నప్పటికీ స్థానికంగా ప్రజా ప్రతినిధుల అండ కావచ్చు, కట్టడి చేయాల్సిన అధికారుల రక్షణ కావచ్చు.. మొత్తంగా ఒక ఆరుగురు ముఠా చెప్పిందే వేదంగా ఈ అక్రమ వ్యవహారం సాగుతోంది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో విశాఖ పట్టణంలో ఒక ప్రాంతం, హైదరాబాద్‌లో బాలానగర్‌ ప్రాంతాలకు గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఓ హాస్టల్‌లో పాతపట్నం నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి గంజాయి సరఫరా చేస్తూ అక్కడ యువతను బలి చేస్తున్నారని తెలుస్తోంది.

నేర సమాచారం ఇచ్చేవారు వివరాలను గోప్యంగా ఉంచాలని చట్టాలు ఘోషిస్తున్నాయి. కానీ కొందరు ఇంటి దొంగలు తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే రీతిలో ఆ సమాచారాన్ని నేర ముఠాలకు లీక్‌ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. సమాచారం ఇచ్చిన పాపానికి అమాయకులు నేరగాళ్ల చేతిలో చిక్కి చితికిపోతున్నారు. జిల్లా శివారు గ్రామం కోసమాలకు చెందిన ఓ వ్యక్తి గంజాయి బ్యాచ్‌ చేతిలో ఇదే తరహాలో చావుదెబ్బలు తిన్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement