మెళియాపుట్టి : భరణికోట గ్రామానికి చెందిన సవర జగ్గారావుకు జిల్లా అదనపు న్యాయ స్థానం జీవిత ఖైదు విధించిందని ఎస్పీ మహేశ్వరరెడ్డి గురువారం వెల్లడించారు. భార్య పద్మ (33)పై అనుమానంతో జగ్గారావు 2021 అక్టోబర్ 16న గొడవకు దిగాడు. తనతో పాటు తెచ్చుకున్న నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో పద్మ అక్కడికక్కడే మృతిచెందింది. కుమారుడు జగదీశ్ విషయాన్ని మావయ్య సవర నరసింహులుకి చెప్పడంతో ఆయన మెళియాపుట్టి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జగ్గారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో జగ్గారావుకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
స్వీయ గణనకు శ్రీకారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తన కార్యాలయంలో గురువారం స్వీయ గణనను విజయవంతంగా నిర్వహించి జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వీయ గణన కాలపరిమితి ఏప్రిల్ 30 వరకు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఎవరి వివరాలు వారే వెబ్‌సైట్‌లోకి వెళ్లి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర జనగణన సంచాలకులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియను ఆయన ప్రారంభించారు. అధికారిక లింక్ http://se.census. gov.in/ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు.


