చిరుద్యోగి అరెస్ట్‌ అన్యాయం | - | Sakshi
Sakshi News home page

చిరుద్యోగి అరెస్ట్‌ అన్యాయం

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

శ్రీకాకుళం అర్బన్‌: ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న చిరుద్యోగిని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అరెస్ట్‌ చేయించి శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించడం అన్యాయమని ఏపీఎస్‌ ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న క్రమంలో స్వీపింగ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రెల్లి కులస్తుడైన ఆకుల శీనును పనితీరు బాగోలేదనే కారణంతో ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా నేరుగా స్టేషన్‌లో పెట్టండని కలెక్టర్‌ ఆదేశించడం దారుణమన్నారు. అంబేద్కర్‌ జయంతి రోజునే ఎస్సీ వర్గానికి చెందిన ఉద్యోగిని అరెస్ట్‌ చేయడం రాజ్యాంగ హక్కుని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. దీనిని ఏపీఎస్‌ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు టి.తిరుపతిరావు, ముత్యాలరావు, కిరణ్‌, నవీన్‌, అనిల్‌, ఈశ్వరమ్మ, జయంతి, పూర్ణ, సత్యవతి, పార్వతమ్మ, కార్మికులు పాల్గొన్నారు.

సిబ్బంది పనితీరుపై కలెక్టర్‌ ఆగ్రహం..

శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి దూరప్రాంతాలకు, మారుమూల గ్రామాలకు నిత్యం వేలమంది ప్రయాణిస్తుంటారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉందన్నారు. కాంప్లెక్స్‌ ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, ఎటువంటి చెత్త, చెదారం లేకుండా చూడాలన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పనితీరుపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్‌.అప్పలనారాయణ, ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్‌లు హనుమంతు అమరసింహుడు, కేఆర్‌ఎస్‌ శర్మ, శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల అసిస్టెంట్‌ మేనేజర్లు పి.సంతోష్‌కుమార్‌, ఎ.గంగరాజు, ఆర్టీసీ ఎస్‌ఎం ఎంపీ రావు, ఆర్టీసీ అధికారులు ఎఎన్‌ఎస్‌ శ్రీనివాస్‌, రాజు, ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement