మండుటెండలో.. చల్లటి నేస్తం! | - | Sakshi
Sakshi News home page

మండుటెండలో.. చల్లటి నేస్తం!

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

పాతపట్నం: వేసవి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా వాటర్‌ మిలాన్‌(పుచ్చకాయ)లే దర్శనమిస్తున్నాయి. వివిధ పనుల రీత్యా బయటకు వచ్చిన వారికి ఎండ నుంచి తక్షణ ఉపశమనం అందించే ఈ పుచ్చకాయలకు వేసవి సీజన్‌ అంతా గిరాకీ ఉంటోంది. సాధారణంగా వేసవిలో మన శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోతుంటాయి. తద్వారా డీ హైడ్రైషన్‌, వడదెబ్బకు గురై కళ్లు తిరిగి కిందపడిపోతుంటారు. ఈ పరిస్థితి ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. అందుకే మన శరీరంలో వాటర్‌, షుగర్‌ లెవల్స్‌ తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ముక్కలు తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పుచ్చకాయలో విటమిన్లు, పోషకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ యాక్సిండెంట్లు, బీ విటమిన్‌, క్లోరిన్‌, జిలాకెరోటిన్లు, ఆల్కలైన్‌, విటమిన్‌–ఎ, విటమిన్‌ బీ–6, విటమిన్‌–సీ, సుక్రోజ్‌, గ్లూకోజ్‌, ఎలక్ట్రోలైట్లు, ఎండాకాలంలో మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. రోజురోజూకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి శరీరానికి ఉపశమనం కల్పిస్తాయి.

భలే గిరాకీ..

ఆరోగ్యం అందిపుచ్చుకునేందుకు చాలామంది పుచ్చకాయలు కొనుగోలు చేస్తున్నారు. చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు వీటిని ఎంతో ఇష్టంగా తింటున్నారు. దీంతో పుచ్చకాయల అమ్మకాలు జోరందుకున్నాయి. నియోజకవర్గ కేంద్రమైన పాతపట్నంలోని దుకాణాలతో పాటు మెళియాపుట్టి, కొత్తూరు, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట మండల కేంద్రాల్లో రోడ్డు పక్కన దుకాణాలు, తోపుడు బండిలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కిలో పుచ్చకాయ రూ.20 నుంచి రూ.30 పలుకుతుండగా, కప్పు పుచ్చకాయ ముక్కల ధర రూ.20 ఉంటోంది. 100 గ్రాముల పుచ్చకాయలో 91.45 గ్రాముల నీరు, 6 శాతం చక్కెర, 90 కేలరీల శక్తి, 7.6 గ్రాముల పిండి పదార్థాలు, 0.6 మాంసకృత్తులు ఉంటాయి. వీటితో పాటు 12 గ్రాముల పొటాషియం, 7 గ్రాముల కాల్షియం, ఓ మిల్లీ గ్రాము సోడియం ఉంటాయి.

వేసవి తాపం..పుచ్చకాయతో

ఉపశమనం

మార్కెట్‌లో భలే గిరాకీ

కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న జనం

ఎన్నో ప్రయోజనాలు..

వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

మలబద్దకం రాకుండా చేస్తుంది.

వృద్ధాప్యంలో అంధత్వం నివారిస్తుంది.

రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించి తక్షణ శక్తినిస్తుంది.

ఆరోగ్యానికి మంచిది

పుచ్చకాయ ఆరోగ్యం కలిగిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ తినవచ్చు. కంటి చూపు మెరుగవుతుంది. కిడ్నీలు, గుండెకు మేలు జరుగుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. వేసవితాపం నుంచి రక్షణ కలుగుతుంది. వీలు దొరికనప్పుడల్లా పండ్ల రూపంలో గానీ, జ్యూస్‌ రూపంలో గానీ తీసుకోవచ్చు.

– డాక్టర్‌ జి.వేణుగోపాల్‌, సీహెచ్‌సీ, పాతపట్నం

Advertisement
 
Advertisement
Advertisement