రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

నందిగాం: టెక్కలి పోలీస్‌స్టేషన్‌లో విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామానికి కూతవేటు దూరంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగాంకు చెందిన కానిస్టేబుల్‌ చీమల గోపాలకృష్ణ(40) మృతి చెందారు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కానిస్టేబుల్‌ గోపాలకృష్ణ శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని తన బుల్లెట్‌ వాహనంపై జాతీయ రహదారి మీదుగా నందిగాం వస్తుండగా, సుమారు రాత్రి 11.30 – 12 గంటల మధ్య వరిపంటను కోసుకొని వస్తున్న కోత మిషన్‌ రేవడిమెరక వద్ద జాతీయ రహదారి ఎక్కే క్రమంలో గోపాలకృష్ణను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయలు పాలైన గోపాలకృష్ణను విడిచిపెట్టి కోత మిషన్‌తో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి మిషన్‌తో పాటు వెళ్లిపోయారు. అయితే రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై ఉన్న బుల్లెట్‌ను చూసిన గుర్తు తెలియని వాహనదారుడు, 100కు ఫోన్‌ చేసి ప్రమాద విషయం తెలియజేశారు. సమాచారం అందుకున్న నందిగాం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ ఆలీ తదితరులు ప్రమాద స్థలానికి చేరుకొని 108 వాహనానికి సమాచారం అందించారు. 108 వాహన సిబ్బంది గోపాలకృష్ణను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రమాదం స్థలంలో దొరికిన ఆనవాళ్లతో దర్యాప్తు సాగించిన పోలీసులు కోత మిషన్‌ ఢీకొట్టినట్లు అనుమానించి ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్‌కు చెందిన విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గోపాలకృష్ణ మృతదేహానికి శవపంచనామా అనంతరం గ్రామానికి తీసుకొచ్చి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో టెక్కలి సీఐ విజయ్‌కుమార్‌, టెక్కలి ఎస్‌ఐ రాము తదితరులు పాల్గొన్నారు. గోపాలకృష్ణ మృతితో నందిగాంలో విషాదం నెలకొంది. ఆయనకు భార్య యెతీష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement