నరసన్నపేట: ఖరీఫ్‌కు ముందు నేలను సారవంతంగా మార్చుకోవాలని గోగు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త జి.చిట్టిబాబు రైతులకు సూచించారు. కామేశ్వరిపేటలో శుక్రవారం ‘ఆత్మా’ సౌజన్యంతో పంటల్లో యాజమాన్య పద్ధతులు, వేసవిలో రైతులు చేపట్టాల్సిన జాగ్రత్తల రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రియ పదార్థాలను అందించడం ద్వారా భూమి సారవంతం అవుతుందన్నారు. పచ్చిరొట్ట ఎరువులు వినియోగించాలన్నారు. ఖరీఫ్‌లో వరి పంట వేసే ముందు కట్టె జనుము, జీలుగు, పిల్లి పెసర వంటి విత్తనాలు వేసుకోవాలన్నారు. 45 రోజులు తర్వాత పొలంలో కలియ దున్నడం వల్ల భూమికి అవసరమైన పోషకాలు అందుతాయన్నారు. ఏటా ఎద పద్ధతిలో వరి పండించడం మంచిది కాదని, కనీసం మూడేళ్లకోసారి అయినా దమ్ము చేసి వరి ఉభాలు చేయడం మంచిదన్నారు. వ్యవసాయ శాఖ ఏడీ ఎల్.వి.మధు మాట్లాడుతూ రైతులు యాంత్రీకరణను వినియోగించడం వల్ల ఖర్చు తగ్గుతుందన్నారు. వరిలో సుడిదోమ నివారణకు కాలిబాటలు తీయాలని సూచించారు. రసాయన ఎరువులు వాడకం తగ్గించాలని, యూరియా అధికంగా వాడటం మంచిది కాదన్నారు. నానో యూరియా, అమ్మోనియం సల్ఫేట్ వాడుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వనరుల కేంద్రం ఏఓ సురేష్, నరసన్నపేట ఏఓ వై.సూర్యకుమారి, రైతు ప్రతినిధులు వాకముళ్లు చక్రధర్, కోట జోగినాయుడు, ఏఈఓ శిరీషా తదితరులు పాల్గొన్నారు.


