శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు, విద్యార్థులకు నష్టం కలిగించే స్మార్ట్ కిచెన్లను తక్షణమే రద్దు చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం ఎంఈఓ–2 ఎన్.కృష్ణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్షయపాత్రను తప్పించి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే వంట కార్మికులతో విద్యార్థులకు భోజనం అందించాలని కోరారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఒక్కొక్క విద్యార్థికి రూ.20 చొప్పున మెనూ చార్జీలు చెల్లించాలని, ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా 5లోపు బిల్లులు, జీతాలు చెల్లించాలని కోరారు. కిచెన్ షెడ్లు లేనిచోట్ల వంట గదులు ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాల, కళాశాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, యూనియన్ మండల కార్యదర్శి టి.ప్రవీణ, నాయకురాలు జి.గౌరీ తదితరులు పాల్గొన్నారు.


