పొలం కంట నీరు | - | Sakshi
Sakshi News home page

పొలం కంట నీరు

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

రబీ వరికి అందని సాగునీరు

మూడు మండలాలకు తీవ్ర నష్టం

లబోదిబో మంటున్న రైతన్నలు

అవస్థలు పడుతున్నాం

ప్రస్తుతం పంట హారం పట్టే దశలో ఉంది. ఇంకో రెండు మూడు తడులు అందిస్తే కొంతవరకూ అయినా పంటను దక్కించుకుంటాం. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలి.

– మెండ సూర్యనారాయణ, రైతు, బద్రి గ్రామం సారవకోట మండలం

రైతులకు కష్టాలే

టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ రైతులకు కష్టాలే. విత్తనాలు మొదలు ప్రస్తుతం సాగునీరు వరకూ నిత్యం పోరాటాలు చేయాల్సి వస్తోంది. సాగునీరు లేక వేలాది ఎకరాలు ఎండిపోతోంది. – బీవీ రమణ,

శ్రీముఖలింగం, జలుమూరు మండలం

జలుమూరు:

ఏడాది ఖరీఫ్‌ ప్రారంభంతోపాటు రబీలో కూడా రైతన్నలు పంటలు పండించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతు సంక్షేమమే తమ ధ్యేయం అని గొప్పలు చెప్పిన నాయకులు కనీసం సాగు నీరు అందించ డం లేదు. ఓ వైపు ఎరువులు దొరక్క నానా అవస్థలు పడిన రైతులకు ఇప్పుడు సాగు నీరు కూడా అందించకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఫిబ్రవరి నుంచి రబీ వరి పంట వేసిన రైతులు నీరు లేక తల్ల్లడిల్లుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వీరంతా సాగునీరు లేకపోవడంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావని ఆందోళన చెందుతున్నారు. వరి నారు పోసిన నుంచి పంట చేతికి వచ్చే వరకూ ఎకరాకు సుమారు రూ. 20 వేలు వర కూ దమ్ము, నారు తీత, నాట్లు వేయడం, గట్టు తదితర పనులతోపాటు ఎరువులు, పురుగు మందులు పిచికారీ తదితర వాటికి ఖర్చవుతోంది. సుమారు 120 రోజుల పంట కాలం గల ఈ రబీ వరి పంట మరి కొద్ది రోజుల్లో చేతికి వస్తుందన్న సమయంలో ఇలా సాగునీరు అందించకపోవడంతో రైతులు తల లు పట్టుకుంటున్నారు. మరో రెండు మూడు తడులు అందిస్తే కొంతవరకూ అయినా పంటను కాపాడుకుంటామని రైతులు చెబుతున్నారు.

ఈ మండలాల్లో సాగు అత్యధికం

హిరమండలం, సారవకోట, జలుమూరు, నరసన్నపేట మండలాల్లో ఎక్కువగా రైతులు రబీ వరి పంట వేశారు. కేవలం 15 శాతం వరకే కోతలు అయ్యాయి. మిగిలిన 85 శాతం పంట పొట్టదశ, చేని ఈని వెన్ను హారం పట్టేదశలో ఉంది. ఇదే సమయంలోనే పంటకు నీరు అందించాలి. వంశధార ప్రధాన ఎడమ కాలువ ద్వారా ఆయా మండలాలకు సాగునీరు అందాల్సి ఉంది. వంశధార తగినంత నీటి నిల్వ లేక పోవడంతో సాగునీరు అందించలేకపోతున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఉన్నంతలో ప్రత్యామ్నాయం చూడాలని రైతులు కోరుతున్నారు.

వైఎస్సార్‌సీపీ విన్నపం

గత సోమవారం నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్యతోపాటు పలువురు రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు సాగునీరు అందించాలని కలెక్టర్‌ కార్యాలయంలో వినతి అందించారు. ఈ మేరకు అధికారులు చొరవ చూపి ఎండుతున్న పొలాలకు సాగునీరు అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement