శ్రీకాకుళం పాతబస్టాండ్: పాత్రికేయులకు ఈ నెల 13 నుంచి వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికా రి కమ్మినాన చెన్నకేశవరావు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ నెల 13 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు జెమ్స్ ఆస్పత్రిలో నిర్వహిస్తామన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీపీ, సుగర్, ఈసీజీ, 2డీ ఎకో (గుండె సంబంధిత), కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సిబిపి) వంటి కీలక పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి జన రల్ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్, న్యూ రో, ఆర్థో, గ్యాస్ట్రో నిపుణుల ద్వారా తనిఖీలు చేయనున్నట్లు వివరించారు. వైద్య పరీక్షలకు హాజరు కావాలనుకునే జర్నలిస్టులు తమ పేరు, పనిచేస్తున్న మీడియా ఆర్గనైజేషన్, అక్రిడిటేషన్ నంబరుతో పాటు, కుటుంబ సభ్యుల వివరాలు, అందరి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సమాచార శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు. ముందుగా ఈ నెల 10వ తేదీ లోపు 8985539662, 9493399367 నంబర్లలో పేర్లు న మోదు చేసుకోవాలని సూచించారు. పేర్లు నమోదు చేసుకున్న వారు, వారికి కేటాయించిన తేదీల్లో మాత్రమే ఆస్పత్రికి హాజరుకావాలన్నారు.


