ఆమదాలవలస: న్యాయవాదులపై జరుగుతున్న దాడులు అమానుషమని, ఇలాంటి ఘటనలు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని బార్ అసోసియేషన్ అధ్యక్షులు కణితి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం పాత వడ్డిపల్లి గ్రామానికి చెందిన యువ న్యాయవాది పూజారి ఎర్రయ్య దారుణ హత్యను ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా న్యాయవాదులు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. న్యాయవాదులపై దాడులను ఖండిస్తూ బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కణితి విజయలక్ష్మి మాట్లాడుతూ న్యాయవాదులు సమాజంలో న్యాయం నిలబెట్టే కీలక వర్గమని, వారి భద్రత కోసం ప్రత్యేక చట్టం అవసరమని పేర్కొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రభు త్వం వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు సీపాన గోవిందరావు, తమ్మినేని అన్నం నాయుడు, బొడ్డేపల్లి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


