శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రం సమీపంలో నవభారత్ కూడలి హైవే రహదారిని ఆనుకొని పల్లపు ప్రాంతంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు మూడు ఎకరాల్లో నీలగిరి మొక్కలున్న ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తకుప్పలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు జిల్లా అగ్నిమాపక సహాయాధికారి శ్రీనుబాబు తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టం ఏమీ జరగలేదన్నారు. మధ్యాహ్నం 1.35 గంటలకు హైవేలో వెళ్తున్న ఓ వ్యక్తి కాల్ చేయడంతో ఘటనాస్థలికి సిబ్బందితో వెళ్లి మంటలు అదుపుచేశామన్నారు. అప్పటికే దట్టమైన పొగలు అలుముకోవడంతో వాహనచోదకులకు ఇబ్బంది కలిగిందన్నారు. దాదాపు రెండు గంటల పాటు మంటలు వ్యాపించాయని స్థల యజమాని మొదలవలస కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేశామని చెప్పారు.


