పాతపట్నం: విద్యార్థుల భద్రత, వసతుల కల్పనలో ఏ మాత్రం అలసత్వం వహించినా సహించేది లేద ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను హెచ్చరించారు. శనివారం మండలంలోని ప్రహారాజపాలెంలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ను కలెక్టర్ ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. ఇటీవల 7వ తరగతి చదువుతున్న చింతల పూజిత మెట్లపై నుంచి జారిపడి మృతి చెందిన ఘటన తెలిసిందే. ప్రమాదంపై క్షుణ్ణంగా ప్రిన్సిపల్ పద్మావతి ని, సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని, మెట్లను, మెడ మీద టెర్రస్‌ను, విద్యార్థిని డార్మిటరీని పరిశీలించారు. విద్యార్థులపై నిఘా లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ పద్మావతి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లకు తలుపులు, ప్రహరీ పనులకు నిధులు మంజూరు చేసినప్పటికి, పనుల్లో జాప్యంపై ప్రిన్సిపాల్‌తో పా టు ఈడబ్లూఐడీసీ జేఈ రామారావుపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుతున్న తరగతి గదులకు వెళ్లి, విద్యార్థులతో నోట్స్ చదివించి, విద్యా బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. శుద్ధ జలం లేకపోవడంతో రిపేర్ చేయించాలని తహసీల్దార్ ప్రసాదరావును ఆదేశించారు. పాతపట్నం గ్రామ సచివాలయం–1ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.


