● అక్రమ తవ్వకాలతో బరితెగింపు
● చోద్యం చూస్తున్న అధికారులు
కొత్తూరు/పలాస: ఇసుకాసురులు బరి తెగించారు. ఉచిత ఇసుక విధానం పేరిట దోపిడీకి తెరతీశారు. టీడీపీ నేతల అండదండలతో అందినంత దోచుకుంటున్నారు. ఇసుక ర్యాంపును పర్యవేక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంతో వీరికి అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. కొత్తూరు మండలంలోని బంకి (పొనుటూరు), వసప గ్రామాల వద్ద వంశధార నదిలో సిల్ట్ తొలగింపు కోసం ప్రభుత్వం గతంలో అనుమతులు ఇచ్చింది. నిబంధనల ప్రకారం మనుషులతో తవ్వకాలు జరిపి ట్రాక్టర్లకు లోడ్ చేయాలి. అక్కడి నుంచి ర్యాంపు మీపంలో ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్‌లో అన్‌లోడ్ చేయాలి. అనంతరం గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక విక్రయించాలి. తవ్వ కాలు సైతం మూడు అడుగుల లోతు దాట కూడదు. అయితే ఈ నిబంధనలేవీ ఇక్కడ అమలుకావడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కాకుండా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. నదిలో ఇసుక తవ్వకాలు ఆరు అడుగుల కంటే ఎక్కవ తవ్వకాలు చేయడంతో ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి చెరువులను తలపిస్తున్నాయి. ఏకంగా నదిలోనే రోడ్లు ఏర్పాటు చేసుకొని అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా పొనుటూరుకు ఆనుకొని ఉన్న ఒడిశా రాష్ట్రానికి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. అస్తవ్యస్త తవ్వకాలతో భూగర్భజలాలు ఇంకిపోయే ప్రమాదం ఉందని పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలు అరికట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై తహశీల్దార్ వై.జోగారావు వద్ద ప్రస్తావించగా ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అయితే నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేసినట్లు ఫిర్యాదు వస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.


